హిమ శిఖరంపై ‘బన్నీ’ జయకేతనం | - | Sakshi
Sakshi News home page

హిమ శిఖరంపై ‘బన్నీ’ జయకేతనం

Sep 27 2026 3:22 AM | Updated on Sep 27 2026 3:22 AM

హిమ శిఖరంపై ‘బన్నీ’ జయకేతనం

● హిమాచల్‌ ప్రదేశ్‌లోని

మౌంట్‌ తరంగ్‌ అధిరోహణ

● గిరిజన బిడ్డ ప్రతిభకు ప్రశంసల వెల్లువ

కామారెడ్డి టౌన్‌ : ఎత్తయిన హిమాలయ పర్వత శ్రేణుల్లో తెలంగాణ గిరిజన యువకుడు సత్తా చాటాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్న విస్లావత్‌ బన్నీ అరుదైన ఘనత సాధించాడు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని లాహౌల్‌–స్పితి జిల్లా మియార్‌ లోయలో ఉన్న అత్యంత క్లిష్టమైన ‘మౌంట్‌ తరంగ్‌–2’ (6,027 మీటర్ల ఎత్తు) శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి జాతీయ స్థాయిలో రికార్డు నెలకొల్పాడు. ట్రాన్స్‌సెండ్‌ అడ్వెంచర్స్‌ ఆధ్వర్యంలో పది మంది సభ్యులతో కూడిన భారతీయ యాత్ర బృందంలో బన్నీ ఒకడిగా పాల్గొన్నాడు. ఎముకలు కొరికే చలి, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని శిఖరాగ్రానికి చేరుకున్నాడు. పర్వత శిఖరంపై భారత త్రివర్ణ పతాకంతోపాటు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ ఫ్లెక్సీని ప్రదర్శించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రముఖ సామాజిక, వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి ఫొటో ఫ్లెక్సీని సైతం ప్రదర్శించాడు.

వ్యవసాయ కుటుంబం నుంచి ఎవరెస్ట్‌ స్థాయికి..

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లాపూర్‌ తండాకు చెందిన బన్నీది నిరుపేద వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ కొడుకును చదివిస్తున్నారు. పర్వతారోహణపై ఉన్న మక్కువతో గతంలోనే ఆఫ్రికాలోని ప్రఖ్యాత కిలిమంజారోతోపాటు కాంగ్‌ యత్సే, లడఖ్‌లోని కై గర్‌ గి పర్వతాలను అధిరోహించి ఔరా అనిపించాడు. తాజాగా మరో శిఖరాన్ని అధిరోహించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ సాధించిన విజయంపై తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి కె. సీతాలక్ష్మి హర్షం వ్యక్తం చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాస స్వామి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement