కంటే కూతుర్నే కనాలి! | - | Sakshi
Sakshi News home page

కంటే కూతుర్నే కనాలి!

Sep 27 2026 3:22 AM | Updated on Sep 27 2026 3:22 AM

కంటే కూతుర్నే కనాలి! వకీల్‌సాబ్‌ పిల్లలిద్దరూ..

● అన్నింటా రాణిస్తున్న ఆడపిల్లలు

● చదువు, ఉద్యోగంలో అగ్రభాగాన...

● నేడు కూతుళ్ల దినోత్సవం

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఆడపిల్లకు ఇచ్చే ఆస్తి కన్నా ఆమెకు అందించే విద్యే జీవితాంతం అండగా నిలుస్తుంది. చదువు ఉంటే ఆత్మవిశ్వాసం వస్తుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఏ రంగంలోకి వెళ్లినా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కూతురిని చదివించి ఆమెకు నచ్చిన రంగంలో ఎదిగే అవకాశం కల్పిస్తే ఆ కుటుంబానికి ఆమె కేవలం కూతురిగా కాకుండా బలమైన శక్తిగా ఎదిగి, అండగా నిలుస్తుంది. ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావించిన కుటుంబాలు ఇప్పుడు అదే కూతురిని తమ భవిష్యత్‌ ఆశగా చూస్తున్నాయి. చదువులో రాణిస్తూ, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు ఎదుగుతూ కుటుంబాన్ని, సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న కూతుళ్లు తల్లిదండ్రుల ఆలోచనలను మారుస్తున్నారు. అందుకే ‘కూతురే కావాలి’ అనే మాట వినిపించే రోజులు వస్తున్నాయి. నేడు కూతుళ్ల దినోత్సవం (డాటర్స్‌ డే) సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

కామారెడ్డి పట్టణానికి చెందిన న్యాయవాది క్యాతం సిద్దరాములు, స్వరూప దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు వెన్నెల ఎంఏ, ఎంఈడీ చదివింది. జ్యోతిబా ఫూలే స్కూల్‌లో టీజీటీ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. మైక్రో ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందింది. రెండో కూతురు చలన అప్పట్లో ఇంటర్‌ స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది. జేఎన్‌టీయూ నుంచి ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదివింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతోంది. కాగా, తల్లి స్వరూప అనారోగ్యంతో చనిపోగా తండ్రి, పిల్లలు కలిసి తల్లి దేహాన్ని మెడికల్‌ కళాశాలకు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement