● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష
కామారెడ్డి క్రైం: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోళ్లపై శనివారం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మద్దతు ధరతోపాటు ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల సన్నాలకు ప్రభుత్వం బోనస్ చెల్లించనుందని తెలిపారు. బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, కేఎన్‌ఎమ్ 1638, హెచ్‌ఎంటీ, కేఎన్‌ఎమ్ 7715, జై శ్రీరామ్, డబ్ల్యూజీఎల్ 44 సన్న వైరెటీల సమాచారం ఇది వరకే జిల్లాలోని సెంటర్ ఇన్‌చార్జీలకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కొనుగోళ్లు ప్రారంభం కాగానే రైతులకు డబ్బులు సకాలంలో జమ అయ్యేలా ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, డీసీఎస్‌వో వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం శ్రీకాంత్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


