● అదనపు ట్రాన్స్‌ఫార్మర్ కోసం
20 ఏళ్ల క్రితం డీడీ చెల్లించిన రైతులు
● అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఓవర్‌లోడ్‌తో మోటార్లు కాలిపోతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో చందాపూర్ గ్రామ రైతులు శనివారం తాడ్వాయి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు తరలివచ్చారు. ఈవిషయమై ఏఈ కరుణాకర్‌ని రైతులు నిలదీశారు. చందాపూర్ శివారులో ట్రాన్స్‌ఫార్మర్‌కు 10 విద్యుత్ కనెక్షన్‌లకు బదులుగా 23 కనెక్షన్‌లు ఉన్నాయని, ఓవర్‌లోడ్‌తో తరుచూ మోటార్లు కాలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్ల క్రితమే డీడీలు చెల్లించినా అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయడంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారని రైతులు ఏఈని ప్రశ్నించారు. ప్రతిరోజు 8మంది రైతుల చొప్పున మోటర్లను నడిపిస్తున్నామని, దీంతో చేతికి వచ్చిన వరి, మొక్క పంటలకు నీరందక ఎండిపోతున్నాయన్నారు. వెంటనే అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయనిచో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. 15రోజులలో అదనపు ట్రాన్స్‌ఫార్మను ఏర్పాటు చేస్తామని ఏఈ కరుణాకర్ రైతులకు సమాధానమిచ్చారు.


