● జిల్లా కేంద్రంలో వైభవంగా
నిమజ్జనోత్సవం ప్రారంభం
● శోభాయాత్రను ప్రారంభించిన కలెక్టర్
ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర
నిమజ్జనానికి తరలుతున్న యువజన సమాఖ్య గణనాథుడు
కామారెడ్డి టౌన్ : నవరాత్రులు పూజలందుకున్న లంబోదరుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా కేంద్రంలో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవ శోభాయాత్ర బుధవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. పట్టణంలోని ధర్మశాల వద్ద యువజన సమాఖ్య వినాయకుడికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. నిమజ్జనోత్సవాన్ని తిలకించేందుకు పట్టణవాసులతో పాటు సమీప గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో సుభాష్ రోడ్డు, జేపీఎన్ రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, మాయాబజార్, పాంచ్‌రస్తా, పెద్దబజార్, పాత పట్టణ వీధులు భక్తజనంతో కిటకిటలాడాయి. పట్టణంలో సుమారు 400లకు పైగా విగ్రహాలను ప్రతిష్టించగా భారీ విగ్రహాలను వాహనాల్లోకి ఎక్కించేందుకు మున్సిపాలిటీ, పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. టేక్రియాల్ చెరువులో విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఇందిరాచౌక్ వద్ద విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వేదిక ఏర్పాటు చేసి మండపాల నిర్వాహకులను ఘనంగా సన్మానించారు.
ఆకట్టుకున్న విగ్రహాలు..
శోభాయాత్రలో భారీ విగ్రహాలతో పాటు విభిన్న రూపాల్లో కొలువుదీరిన గణనాథులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాహనాలను రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు. నాసిక్ డోలు, డప్పు చప్పుళ్లు, యువకుల నృత్యాల నడుమ శోభాయాత్ర వైభవంగా సాగింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


