కామారెడ్డి టౌన్ : దేశం ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని, అందులో యువత కీలక పాత్ర పోషించాలని జిల్లా సైన్స్ అధికారి సిద్ధరాంరెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్కిడ్స్ హైస్కూల్‌లో భారత ఇంధన బాస్కెట్–2047, అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై జిల్లా స్థాయి సైన్స్ సెమినార్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధరాంరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే శాసీ్త్రయ ఆలోచనా విధానాన్ని పెంపొందించుకుని, భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. సెమినార్‌లో పాల్గొన్న విద్యార్థులు భవిష్యత్ భారత ఇంధన అవసరాలు, సంప్రదాయేతర ఇంధన వనరుల ఆవశ్యకత, ఇంధన సంరక్షణపై ప్రదర్శనలిచ్చారు. ఈ ప్రదర్శనలో విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం గోవర్ధన్‌రెడ్డి, ఉపాధ్యాయులు ప్రతాప్‌రెడ్డి, కృష్ణాకర్, సురేష్, మల్లేష్, లలిత పాల్గొన్నారు.
● పాఠాలు పక్కనపెట్టి విద్యార్థులకు సినిమా చూపించిన లెక్చరర్
మద్నూర్: మండల కేంద్రంలోని రాం సుఖ్ బాల్‌ముకుంద్ ఇనాని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ క్లాస్‌ల నిర్వహణకు ఉపయోగించాల్సిన తెరపై బుధవారం సినిమాను ప్రదర్శించారు. ఇది వివాదాస్పదంగా మారింది. విద్యార్థులకు పాఠాలు చెప్పి వారి అభ్యున్నతికి కృషి చేయాల్సిన లెక్చరర్.. తరగతి గదిలో కాంచన సినిమా చూపించడంతో ఇతర గ్రూప్‌ల విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. దీనిపై తోటి లెక్చరర్లు ప్రశ్నించగా.. సదరు లెక్చరర్ వారితో వాగ్వాదానికి దిగి, దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. ఈ కళాశాలలో ఫలితాలు ఆశాజనకంగా ఉండడం లేదు. విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించి, మంచి ఫలితాల కోసం కృషి చేయాల్సిన లెక్చరర్.. పాఠ్యాంశాలకు సంబంధంలేని సినిమా చూపించడం ఏమిటని విద్యాభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కళాశాల ప్రిన్సిపల్ పాండురంగ్‌ను వివరణ కోరగా.. తరగతి గదిలో సినిమా ప్రదర్శన విషయాన్ని ఇంటర్ నోడల్ అధికారి దృష్టికి తీసుకువెళ్లామని, సదరు లెక్చరర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మాచారెడ్డి: భవానీపేట శివారులో కామారెడ్డి – సిరిసిల్ల ప్రధాన రహదారి పక్కన గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. ఇక్కడ 42 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయి. నిధులు లేకపోవడంతో తర్వాతి పనులు పూర్తి చేయలేకపోయారు. ఆ తర్వాత పట్టించుకునేవారు లేకపోవడంతో నిర్మాణాల చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి. పాలకులు స్పందించి నిర్మాణాలను పూర్తి చేసి పంపిణీ చేయాలని పేదలు కోరుతున్నారు.


