కామారెడ్డి క్రైం: ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ఆహార భద్రత సలహా మండలి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాల అమలు, ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, ప్రజలకు సురక్షితమైన ఆహారం అందేలా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. పాఠశాలలు, వసతి గృహాల్లో పరిశుభ్రమైన వాతావరణం, సురక్షిత తాగునీటి లభ్యతను నిర్ధారించేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. నిబంధనలు పాటించని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గిరి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ విక్రమ్, జిల్లా సంక్షేమ అధికారి ప్రసన్న, డీపీవో మురళి తదితరులు పాల్గొన్నారు.


