యాసంగిలో బోనస్..
క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామన్న సర్కారు ప్రకటనతో చాలామంది రైతులు సన్నరకం వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే వానాకాలంలో ప్రోత్సాహకాన్ని అందిస్తున్న ప్రభుత్వం.. యాసంగికి వచ్చేసరికి చేతులెత్తేస్తోంది. రెండేళ్లుగా బోనస్ రాకపోవడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. – కామారెడ్డి క్రైం
జిల్లాలో గతంలో రైతులు సన్నరకాల సాగుకు ఆసక్తి చూపేవారు కాదు. తక్కువ దిగుబడి రావడం, చీడపీడల బాధ ఎక్కువగా ఉండడంతో దొడ్డు రకాలనే పండించేవారు. 80 శాతానికి పైగా దొడ్డు రకాలే పండేవి. అయితే ప్రభుత్వం బోనస్ ఇచ్చామని ప్రకటించడంతో రైతులు సన్నరకాలు సాగు చేస్తున్నారు. గత యాసంగి సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 2,52,785 ఎకరాల్లో వరి సాగయ్యింది. ఇందులో 1,50,470 ఎకరాల్లో దొడ్డు రకాలు, 1,00,315 ఎకరాల్లో సన్న రకాలు ఉన్నాయి.
గత యాసంగిలో రూ. 90 కోట్లు..
యాసంగిలో ప్రభుత్వం 400 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించింది. మొత్తం 74,894 మంది రైతుల నుంచి 4,66,38.68 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 45,835 మంది రైతుల నుంచి 2,85,450.96 మెట్రిక్ టన్నులు దొడ్డు రకం, 29,059 మంది రైతుల నుంచి 1,80,937.72 మెట్రిక్ టన్నులు సన్న రకం వడ్లు ఉన్నాయి. కొనుగోలు చేసిన మొత్తం ధాన్యం విలువ రూ.1,114.20 కోట్లు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పటికే రైతుల ఖాతాలలో జమ చేసింది. సన్నరకాలు పండించిన రైతులకు బోనస్ కింద రూ. 90.47 కోట్ల వరకు రావాలి. 2024–25 యాసంగి సీజన్‌లోనూ సర్కారు బోనస్ చెల్లించలేదు. ఆ సీజన్‌కు సంబంధించి రైతులకు రూ. 89 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఖరీఫ్‌లో సక్రమంగా బోనస్ ఇస్తున్న ప్రభుత్వం.. యాసంగికి వచ్చేసరికి నిధులు విడుదల చేయడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తారన్న ఆశతోనే సన్నాలు సాగు చేశామని పేర్కొంటున్నారు. రెండేళ్లకు సంబంధించిన నిధులను త్వరగా విడుదలచేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరుతున్నారు.
ప్రోత్సాహకం ఆశతోనే
సన్నాల సాగుపై ఆసక్తి
రెండేళ్లుగా మొండిచేయి
చూపిస్తున్న సర్కారు
నిరాశ చెందుతున్న అన్నదాతలు


