● జిల్లాకేంద్రంలో ఘనంగా రథయాత్ర
● భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తజనం
కామారెడ్డి అర్బన్: అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జిల్లాకేంద్రంలో శ్రీజగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహించారు. దేవునిపల్లిలో పట్టణ సీఐ నరహరి, దేవునిపల్లి ఎస్సై రంజిత్.. రథం ముందు చీపురుతో శుభ్రం చేసి రథాన్ని కదిలించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సిరిసిల్ల రోడ్డులోని అయ్యప్ప కల్యాణ మండపం వరకు రథయాత్ర కొనసాగింది. భక్తులు జై జగన్నాథ నినాదాలతో రథాన్ని లాగుతు భక్తితో పరవశించిపోయారు. అనంతరం అయ్యప్ప కల్యాణ మండపంలో శ్రీజగన్నాథుడు, బలదేవుడు, సుభద్రాదేవిలకు 56 రకాల వంటకాలతో నైవేధ్యం సమర్పించారు. జగన్నాథ సంకీర్తనలు, భజనలు, నృత్యాలు చేశారు. ఇస్కాన్ ప్రతినిధులు సిద్దబలరాం ప్రభు, వెంకటదాస్ ప్రభు, అరవింద్ ప్రభు, పంతులు శ్రీను, కౌన్సిలర్ భోజన్నగారి వినోద, నాయకులు పురంశెట్టి శ్రీనివాస్, ఎస్.రాజామౌళి, ఎం.జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


