వరిలో సస్యరక్షణ చర్యలు
కాండం కుళ్లు తెగులు
● కాండం తొలుచు పురుగును అరికట్టాలి
● రుద్రూర్ పరిశోధన కేంద్రం
కీటక శాస్త్రవేత్త సాయి చరణ్
రుద్రూర్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వరి పంటకు కాండం తొలుచు పురుగు ఆశిస్తోంది. రైతులు యాసంగిలో తెలంగాణా సోనా, కూనారం–118, జగిత్యాల–24423, జగిత్యాల–18047, ఎంటీయూ–1010, గంగా భవాని వంటి కొన్ని ప్రైవేటు సంస్థలకు చెందిన రకాలను సాగు చేస్తున్నారు. రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ఇటీవల క్షేత్ర సందర్శన చేసినపుడు పొలాల్లో ఆశించిన చీడ పీడలను గుర్తించారు. వీటి నివారణ చేపట్టాల్సిన చర్యల గూర్చి కీటక శాస్త్రవేత్త సాయికిరణ్ సమగ్రంగా వివరించారు.
కాండం తొలుచు పురుగు(మోగి పురుగు)
యాసంగిలో సాగు చేస్తున్న వరిలో ఈ పురుగు ఉధృతి అధికంగా ఉంటుంది. పంట పిలక దశ నుంచి దుబ్బుచేసే దశ వరకు మోగి పురుగు ఆశిస్తే మొవ్వు చనిపోతుంది. ఈనిక దశలో ఆశించినట్లయితే వెన్నులు అంతా తాలుగా మారి తెల్ల కంకులు ఏర్పడతాయి.
నివారణ చర్యలు
నారు పీకే వారం రోజుల ముందు ఒక ఎకరానికి సరిపోయే, 5 గుంటల నారుమడికి 800 గ్రాముల కార్బోప్యూరాన్ 3జీ గుళికలను పలుచగా నీరు పెట్టి నారుమడిలో వేసుకోవాలి. ప్రధాన పొలంలో నాట్లు వేసిన తర్వాత 25 రోజుల లోపు కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను 8 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలను 8 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4జీ గుళికలు 4కిలోలు పలుచగా నీరు పెట్టి వేసుకోవాలి. ఎకరానికి 4–5 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉధృతిని గమనిస్తూ ఉండాలి. ఒక వారంలో ఒక్కో బుట్టలో 25 లేదా అంతకుమించి మగ రెక్కల పురుగులు గమనించినట్లయితే పురుగు మందులను పిచికారి చేయాలి. అంకురం నుంచి చిరుపొట్ట దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50శాతం ఎస్‌పీ 2గ్రా., లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 శాతం ఎస్‌సీ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
రాష్ట్రంలో గత నాలుగేళ్ల నుంచి యాసంగి వరిలో, పొడి వాతావరణం ఉన్నప్పుడు, నీటి ఎద్దడి ఏర్పడిన పరిస్థితుల్లో, మురుగు నీరు పోయే సౌకర్యం లేని పొలాల్లో దుబ్బు, ఈనిక దశల్లో కాండం కుళ్లు తెగులు ఉధృతి ఉంది. మొక్కల కాండం పైన నీటి మట్టానికి దగ్గర, చారాలతో కూడిన మచ్చలు ఏర్పడి అవి మొక్క లోపలికి విస్తరించి, ఆకులు పసుపు రంగులోకి మారి, పిలకలు చనిపోతాయి. కాండం లోపలి కణజాలాన్ని చీల్చి చూస్తే నల్లటి శిలీంద్ర బీజాలను గమనించవచ్చు. తెగులు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు, తాలు గింజలు ఏర్పడతాయి. వరిలో కాండం తొలుచు పురుగు, ఇతర కీటకాల వలన ఏర్పడిన గాయాలు, అధిక మోతాదులో నత్రజని ఎరువు వాడటం, సిఫారసు మేరకు వేయకపోవడం వల్ల మొక్క బలహీనపడి ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుంది. లోతు దుక్కులు చేసుకోవాలి. ఎకరానికి 15–20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ దమ్ములో, అంకురం తొడిగే దశలో వేసుకోవాలి. నాటిన 25 రోజుల లోపు తెగులు లక్షణాలు గమనిస్తే ఒక కిలో యూరియాకి 2.5 గ్రాముల కార్బండజిమ్+మ్యాంకోజెబ్ కలిపి పైపాటుగా చల్లుకోవాలి. పంటలో అడపా దడపా నీరు తీసేసి ఆరనివ్వాలి. మొక్క మొదళ్లను తడిచేలాగా ప్రాపికొనజోల్ ఇసి 25శాతం ఇసి 1.0 మి.లీ. లేదా వాలిడామైసిన్ 3శాతం ఎల్ 2.0 మి.లీ. లేదా హెక్సాకొనజోల్ 5శాతం ఎస్‌సీ 2.0 మి.లీ లీటరు నీటికి కలుపుకొని వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలని శాస్త్రవేత్త సాయికిరణ్ వివరించారు.
వరిలో సస్యరక్షణ చర్యలు


