ముగిసిన సర్పంచుల శిక్షణ తరగతులు
కామారెడ్డి రూరల్: కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐదు రోజులుగా నూతన సర్పంచులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. గ్రామ సర్పంచులు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ శిక్షణను ప్రత్యేకంగా రూపొందించారు. గ్రామాభివృద్ధి, ప్రణాళికల సిద్ధం, గ్రామ సభల సమర్థవంతమైన నిర్వహణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగంలో పారదర్శకత, గ్రామ ఖాతాల నిర్వహణ, సామాజిక ఆడిట్ విధానం, శుచిత్వ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ, తాగునీటి సమస్యల పరిష్కారం, రహదారి, విద్యుత్ సదుపాయాల మెరుగుదల, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ వంటి అనేక అంశాలపై అవగాహన కల్పించారు.
శిక్షణలో భాగంగా సర్పంచులు తమ గ్రామాలలో ఎదురవుతున్న సమస్యలను వివరించి, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. అనుభవజ్ఞులైన శిక్షణ సిబ్బంది గ్రామ స్థాయిలో సమన్వయం, ప్రజల భాగస్వామ్యం, యువత పాత్ర, మహిళల భాగస్వామ్యం వంటి అంశాల ప్రాధాన్యతను వివరించారు.
ముగింపు కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ.. గ్రామాల సమగ్రాభివృది్‌ధ్ కోసం సర్పంచులు ధృఢ సంకల్పంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన సర్పంచులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.


