కామారెడ్డిలో చైన్ స్నాచింగ్
కామారెడ్డి క్రైం: భార్యా, భర్తలు బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి మరో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళ మెడలోంచి బంగారపు చైన్ లాక్కుని ఉడాయించిన ఘటన కామారెడ్డిలోని దేవునిపల్లి ప్రధాన రహదారిపై శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన కమ్మరి శ్రీనివాస్, అతని భార్య అనంతలక్ష్మి పనిమీద తాడ్వాయికి వెళ్తున్నారు. దేవీవిహార్ దాటగానే వెనుక నుంచి మరో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అనంతలక్ష్మి మెడలోంచి బంగారం గొలుసు లాక్కుని పరారయ్యారు. ఘటనలో బైక్‌పై నుంచి కిందపడిపోయిన దంపతులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధుడి అదృశ్యం
నిజామాబాద్ రూరల్: మాక్లుర్ మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన బీరెల్లి కిషన్‌రావు(75) అనే వృద్ధుడు అదృశ్యమైనట్లు రూరల్ ఎస్‌ఎచ్‌వో శ్రీనివాస్ శనివారం తెలిపారు. కిషన్‌రావు జిల్లా కేంద్రంలోని లక్ష్మీప్రియనగర్‌లో ఉన్న బంధువు ఇంటికి వచ్చాడు. ఈ నెల 18న ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. వృద్ధుడి ఆచూకీ తెలిసిన వారు 8712659735 నంబర్‌ను సంప్రదించి స్థానిక పీఎస్‌లో సమాచారం అందించాలని ఎస్‌హెచ్‌వో కోరారు.


