ఇస్రోజీవాడి నుంచి దండకారణ్యం దాకా..
● దళ సభ్యుడి నుంచి వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో సెక్రెటరీ వరకు..
● లోకోటి చందర్ ప్రస్థానం
● మృతదేహాన్ని తీసుకురావడానికి వెళ్లిన కుటుంబ సభ్యులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉమ్మడి జిల్లా విప్లవోద్యమంలో లోకోటి చందర్ అలియాస్ స్వామి అలియాస్ ప్రభాకర్ ది ప్రత్యేక స్థానం. 1990 ప్రాంతంలో పీపుల్స్‌వార్‌లో నక్సలైట్ ఉద్యమంలో చేరిన ఆయన కొంత కాలానికే పూర్తి స్థాయి కార్యకర్తగా మారి, స్వామి పేరుతో చురుకుగా పనిచేశారు. 1993 సెప్టెంబర్‌లో నిజామాబాద్ జిల్లా పడ్కల్‌లో ఓ ఇంట్లో స్వామి దళం ఉందన్న సమాచారంతో పోలీసు బలగాలు ఊరిని చుట్టుముట్టాయి. ఇంట్లో దాక్కున్న దళ సభ్యులంతా చనిపోయినా, స్వామి పోలీసులతో పోరాడి గేదెల మంద రావడంతో పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నారు. దాదాపు 36 గంటల పాటు జరిగిన కాల్పుల సంఘటనలో స్వామి తప్పించుకున్న తీరును గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎలా తప్పించుకున్నాడన్న దానిపై కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు గడ్చిరోలి జిల్లాలో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో స్వామి చనిపోవడంతో అప్పట్లో నక్సల్స్ ప్రభావిత గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు.
భార్య కడసారి చూపునకూ నోచుకోక..
మావోయిస్టు పార్టీలో వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో సెక్రెటరీగా పనిచేసిన స్వామి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించి ప్లాటూన్ కమాండర్‌గానూ పనిచేశారు. ఆయన గెరిల్లా ఆర్మీ శిక్షణలు ఇచ్చారని తెలుస్తోంది. దండకారణ్యానికి వెళ్లిన త ర్వాత ప్లాటూన్ కమాండర్‌గా పనిచేసి పీఎల్‌జీఏ ను విస్తరించడంలో కీలక భూమిక పోషించారని చెబుతారు. చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోనే ఎక్కువ కాలం పనిచేశారని తెలుస్తోంది. కాగా స్వామి కుటుంబమంతా విప్లవోద్య మంలో పాల్గొంది. ఆయన భార్య సులోచన అనారోగ్యంతో చనిపోయిన సమయంలో ఆయన దూ రంగా ఉండడంతో అంత్యక్రియలకు కూడా హాజ రు కాలేకపోయారని సమాచారం.
మూడున్నర దశాబ్దాల పాటు విప్లవోద్యమంలో కొనసాగిన స్వామి అలియాస్ చందర్.. శుక్రవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జ రిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆయన మృతదేహాన్ని తీసుకురావడం కోసం స్వామి కుమా రుడితో పాటు బంధువులు అంబులెన్స్‌ను తీసుకుని శనివారం వెళ్లారు. ఆదివారం ఉదయం వరకు మృతదేహాన్ని తీసుకుని వచ్చే అవకాశాలున్నాయి.
అంచెలంచెలుగా ఎదిగి..
వ్యవసాయమే స్వామి కుటుంబం జీవనాధారం. 1990లలో పీపుల్స్‌వార్ నక్సల్స్ గ్రామానికి రావడంతో స్వామి ఉద్యమానికి ఆకర్శితుడయ్యారు. కొంతకాలం వారికి సహకరించి, పూర్తి స్థాయి కార్యకర్తగా మారారు. దళ సభ్యుడిగా చురుకుగా పనిచేసిన స్వామి.. కొద్ది కాలానికే డిప్యూటీ కమాండర్‌గా, తర్వాత కమాండర్‌గా ఎదిగారు. సిర్నాపల్లి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి, సిరిసిల్ల దళాలకు నాయకత్వం వహించారు. స్వామి పేరుతోనే జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ఆయుధాల కోసం పోలీస్ స్టేషన్లపై దాడుల నుంచి పలు సంఘటనల్లో ఆయన పాల్గొన్నాడని అప్పట్లో ఆయనతో పనిచేసి, జనజీవన స్రవంతిలో కలిసిపోయినవారు చెబుతారు. పోలీసు నిర్బంధం పెరిగి ఎన్‌కౌంటర్లలో పలువురు నక్సల్ నేతలు చనిపోవడంతో ఉమ్మడి జిల్లాలో స్వామి ఒక్కరే మిగిలారు. దీంతో మావోయిస్టు పార్టీ ఆయనను దండకారణ్యానికి పంపించింది. అబూజ్‌మడ్, గడ్చిరోలీ తదితర ప్రాంతాల్లో ఆయన పనిచేశారు.


