మెట్లబావులకు పునర్‌వైభవం కలిగేనా..
● ఎలారెడ్డిలో రామాలయం, గోపాలస్వామి ఆలయంలో మెట్ల బావులు
● నాగన్న బావిలాగా అభివృద్ధి చేయాలని స్థానికుల వినతి
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డిలో ఉన్న మెట్ల బావులకు పునర్ వైభవం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.ఎల్లారెడ్డి పట్టణంలోని రామాలయంలో 350 ఏళ్ల క్రితం సిద్ది రామన్న రామాలయంతో పాటు మెట్ల బావిని నిర్మించగా, సిద్ది ఈశన్న గోపాల స్వా మి ఆలయంతో పాటు మెట్ల బావిని నిర్మించారు. గతంలో ఈఆలయాలలో శ్రీరామనవమి ఉత్సవాలతో పాటు నెల రోజుల పాటు జాతర కొనసాగుతుంది. చుట్టూ పక్కల గ్రామాల నుంచి జాతరకు వచ్చిన వారు మెట్ల బావిలో దిగి స్నానాలు ఆచరించి రాముడిని దర్శించుకునే వారు. ప్రస్తుతం వారం రోజుల పాటు జాతర కొనసాగుతుంది. రానురాను మెట్ల బావిలో పెద్ద పెద్ద పొదలు పెరిగిపోయాయి. మెట్ల బావి శిథిలావస్థకు చేరే ప్రమాదముంది.
కలెక్టర్ ఆదేశించినా....
లింగంపేట మండల కేంద్రంలో గల నాగన్నబావి లాగా ఎల్లారెడ్డిలో గల రామాలయం, గోపాల కృష్ణ ఆలయంలో గల మెట్ల బావులను ప్రభుత్వం అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో జిల్లా కలెక్టర్‌గా పని చేసిన జితేష్ వీ పాటిల్ ఎల్లారెడ్డిలో గల రామాలయం, గోపాల కృష్ణ స్వామి ఆలయంలో ఉన్న మెట్ల బావులను పరిశీలించారు. మున్సిపల్ అధికారులకు వీటిలో గల పొదలను తొలగించి అభివృద్ది చేయాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. దీంతో మున్సిపల్ అధికారులు బావిలోని చెట్లను. పొదలను తొలగించే పనులు చేపట్టారు. ఇంతలో కలెక్టర్ బదిలీ కావడంతో పట్టించుకునే వారు కరువయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
ఎల్లారెడ్డి రామాలయం ఆవరణలో ఉన్న మెట్ల బావి
ఎల్లారెడ్డి గోపాల స్వామి ఆలయంలో ఉన్న మెట్ల బావి
మెట్లబావులకు పునర్‌వైభవం కలిగేనా..


