నేరాల నివారణకు ముందస్తు నిఘా అవసరం
● నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలి
● పోలీస్ సిబ్బందికి సూచించిన ఎస్పీ
తాడ్వాయి(ఎల్లారెడ్డి): నేరాల నివారణకు ముందస్తు నిఘా అవసరమని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. గురువారం తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీ స్ స్టేషన్‌లోని సిబ్బంది హాజరు (రోల్ కాల్), వారి క్రమశిక్షణ,సమయపాలనను పరిశీలించారు. విధు ల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్ కౌంటర్, రికార్డుల గదులను పరిశీలించారు. స్టేషన్‌ను పరిశుభ్రంగా నిర్వహించాలని, కేసుల నమోదు, రికార్డుల నవీకరణలో ఎలాంటి జాప్యం ఉండకూడదని సూచించారు. ‘విక్టిమ్,సిటిజన్, సెంట్రిక్ పోలీసింగ్’ విధానంపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించాలన్నారు. ప్రజల ఫిర్యాదులపై వేగంగా స్పందించి పరిష్కార దిశగా పనిచేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. జిల్లాలో ఇటీవల జరుగుతున్న ఆస్తి సంబంధిత నేరాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాత్రి సమయాల్లో నిరంతర పెట్రోలింగ్, గస్తీ పెంచాలని, అనుమానితులపై నిఘా ఉంచాలని ఎస్‌ఐని ఆదేశించారు. కార్యక్రమంలో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, ఎస్‌ఐ స్రవంతి, ఏఎస్‌ఐ కొండల్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


