ప్రయోగాల కోసం నిధులు మంజూరు
● ఫిబ్రవరి 2 నుంచి
ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు
● రసాయనాలు, పరికరాల కొనుగోలు కోసం రూ.50 వేలు
బిచ్కుంద(జుక్కల్): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని ప్రయోగశాలల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు ప్రాక్టికల్స్ ద్వారా నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం లేదని లెక్చరర్లు, విద్యార్థులు ఆందోళన చెందుతున్న తరుణంలో సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించి ఒక్కో కళాశాలకు రూ.50 వేల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో రసాయనాలు, పరికరాలు సమకూర్చుకోవాలని ఆదేశించింది. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్ పరికరాలు, రసాయనాలు ఇతర సామగ్రి కళాశాలలకు సరఫరా చేస్తున్నారు. ఫిబ్రవరి 2 నుంచి కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వచ్చిన పరికరాలతో విద్యార్థులు ప్రాక్టికల్స్ పరీక్షలకు సిద్ధమయ్యారు. బిచ్కుంద జూనియర్ కళాశాలలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మూడు మీడియం తరగతులు కొనసాగుతున్నాయి. మొదటి సంవత్సరంలో 123 మంది, ద్వితీయ సంవత్సరంలో 113 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.


