హామీలు అమలు చేయని కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
కామారెడ్డి క్రైం: కాంగ్రెస్ హామీల అమలులో మోసం చేసిందని మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ ఆరోపించారు. అందుకే ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసంలో బుధవారం ఆయన మాట్లాడారు. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలకు కేసీఆర్ తనను కో–ఆర్డినేటర్‌గా నియమించారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కృషితో నూతన భవనాలు, రోడ్లు, డివైడర్‌లు, మెడికల్ కళాశాలలు లాంటి అనేక అభివృద్ధి పనులు జరిగిన విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. హామీలిచ్చి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి సైతం ఇచ్చిన హామీలు మరిచిపోయారని విమర్శించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 23 స్థానాల్లో విజయం సాధించిందని గుర్తు చేశారు. ఈ సారి 30 సీట్లు గెలిపించి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు రాజేశ్వర్ రావు, బల్వంత్ రావు, పాత హన్మాండ్లు, నల్లవెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.


