ఆస్పత్రుల్లో మెరుగైన సేవలందించాలి
కామారెడ్డి టౌన్/బాన్సువాడ రూరల్/ఎల్లారెడ్డి/తాడ్వాయి:: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య, ఉప కేంద్రాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పర్వీన్ సుల్తానా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు, సిబ్బందికి సూచించారు. జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె బాన్సువాడ ఏరియా ఆస్పత్రి, ఎర్రాపహాడ్ పీహెచ్‌సీ, ఎల్లారెడ్డి సీహెచ్‌సీతో పాటు మాచారెడ్డి, భిక్నూర్, రాజీవ్ నగర్ తదితర పీహెచ్‌సీలను, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను సందర్శించారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో పీవోలు, మెడికల్ ఆఫిసర్లు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మలేరియా, ఫైలేరియా నివారణ చర్యలు, ప్రసవాల సంఖ్య, ల్యాబొరేటరీ తదితర వైద్య సేవలపై సమీక్షించారు.
హెచ్‌ఎంఐఎస్, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం అమలుపై అధికారులకు సూచనలు చేశారు. డీఎంహెచ్‌వో డాక్టర్ విద్య, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ మౌనిక, అమీమా, వెంకటస్వామి, ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి , డీపీవో పద్మజ, డీపీఎంవో చలపతి, డీఈఎంవో వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.


