ఆత్రేయపురం: బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్న వేళ.. కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన వాడపల్లి క్షేత్రం ఇల వైకుంఠంగా భాసిల్లుతోంది. ఆలయంలో శ్రీవారి 14వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఆగమశాస్త్రానుసారం విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు ఎటువంటి విఘ్నాలూ కలగరాదని ప్రార్థిస్తూ తొలుత విష్వక్సేన పూజ జరిపారు. అనంతరం అష్ట కలశారాధన, స్నపనం, ప్రధాన హోమాలు, నిర్వహించారు. టీటీడీ వేద పండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యులు శిష్ట్లా సూర్య కుటుంబరావు, అర్చకులు వాడపల్లి సుందర శేషావతారం, అర్చక బృందంతో పాటు వేద పండితులు తెల్లవారుజాము నుంచీ భక్తజనరంజకంగా ఈ పూజలు చేశారు. ఉభయ దేవేరులతో కలసి శ్రీవారు ఉదయం కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పండితులు సాయంత్రం చూర్ణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి స్వామి వారిని కల్కి అలంకరణతో మేళతాళాలు, బాణసంచా కాల్పులు, వివిధ కళారూపాలు, నృత్య బృందాల సందడి నడుమ అశ్వ వాహనంపై వైభవంగా ఊరేగించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల గోవింద నామ స్మరణతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ కళాబృందాలు ప్రదర్శించిన భరతనాట్యం వంటి శాసీ్త్రయ నృత్యాలు, స్వామివారి నృత్య రూపకం భక్తులను అలరించాయి. డోలు వాయిద్యంతో మహిళలు ప్రదర్శించిన నృత్యం భక్తులను ఎంతో ఆకట్టుకుంది. భారీగా వచ్చిన భక్తులతో ఆలయం జనసంద్రంగా మారింది. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని సుగంధభరిత పుష్పమాలికలు, రంగురంగుల విద్యుద్దీప తోరణాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాల పూజలు, కై ంకర్యాల్లో దేవదాయ శాఖ ఉప కమిషనర్, ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధరరావు దంపతులు పాల్గొని, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పండితుల సుస్వర వేదమంత్రోచ్చారణల నడుమ కడు రమణీయంగా సాగిన ఉత్సవాలను భక్తులు ఆద్యంతం కన్నులారా తిలకించి, పులకించిపోయారు.
డోలు వాయిద్యాలతో ప్రత్యేక
ఆకర్షణగా నిలిచిన మహిళల నృత్యం
వాడపల్లిలో ఘనంగా బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు
స్వామివారికి ఉదయం
కల్పవృక్ష వాహన సేవ
రాత్రి అశ్వవాహనంపై
దర్శనమిచ్చిన శ్రీవారు
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు


