● జలదిగ్బంధంలో పలు పోలింగ్ కేంద్రాలు
● బురద, నీటితో ఓటర్లకు అవస్థలు
సాక్షి, అమలాపురం: వరుస తుపాన్లతో అతలాకుతలమైన జిల్లాలో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. చాలాచోట్ల విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు. పైగా, తుపాన్ల ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల కమిషన్ వాయిదా వేయవచ్చు. కానీ, ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపింది. ఫలితంగా జిల్లాలోని అనేక పోలింగ్ కేంద్రాల్లో ఇటు ఓటర్లు, అటు ఎన్నికల సిబ్బంది నానా అగచాట్లూ పడ్డారు.
అవస్థలు ఇలా..
● రాజోలు దీవిలోని మలికిపురం మండలం మేడిశెట్టిపాలెం, లక్కవరం ఆర్‌ఆర్ గ్రూప్, తూర్పు పాలెం, చింతలమోరి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద వర్షపు నీరు నిలిచింది.
● సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం, శృంగవరప్పాడు, అంతర్వేది, అంతర్వేది పల్లిపాలెం, గొంది, అంతర్వేదిపాలెం ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాజోలులోని బాలుర ఉన్నత పాఠశాల, కో ఆపరేటివ్ స్కూల్, పంచాయతీ కార్యాలయం, బాలికల ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు ముంపులోనే కొనసాగాయి.
● మామిడికుదురు జెడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద బురద సమస్యను అధిగమించేందుకు చెక్క బల్లలు వేశారు. అంబాజీపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో బురద ఉండటంతో పోలింగ్ మొదలైన తరువాత క్వారీ డస్ట్ చల్లారు.
● అల్లవరం మండలం బెండమూర్లంకలోని 26, 27 పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు కనీసం సరైన దారి కూడా లేకుండా పోయింది. అప్పటికప్పుడు ఇంజిన్లతో నీటిని తోడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గత్యంతరం లేక ఓటర్లు మోకాళ్ల లోతు నీటిలో నడుచుకుంటూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చింది.
● ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప పోలింగ్ కేంద్రానికి వెళ్లే మార్గంలో సుమారు 30 మీటర్ల మేర రహదారి నీట మునిగింది.
● రాజోలు కో ఆపరేటివ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


