● రైతులు, మత్స్యకారులకు
నష్టపరిహారం చెల్లించాలి
● వైఎస్సార్ సీపీ నేత వంగా గీత డిమాండ్
పిఠాపురం: వరుస తుపానులు, భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు, రైతులను తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. తుపానులు, భారీ వర్షాలకు పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవించినా ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సహాయక చర్యలు అందడం లేదని విమర్శించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా దెబ్బ తిన్నాయని చెప్పారు. మత్స్యకారులకు చెందిన కొన్ని పడవలు విరిగిపోయాయని, మరికొన్ని కొట్టుకుపోయాయని, వలలు పనికిరాకుండా పోయాయని, దీంతో ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండు చేపల వ్యాపారుల షెడ్లు, నిల్వ చేసిన సరకులు సైతం సముద్రపు నీటిలో కొట్టుకుపోయాయన్నారు. అనేక ఇళ్లు సముద్ర కోతకు గురయ్యాయన్నారు. ఇళ్లల్లోకి మట్టి, బురద చేరడంతో కనీసం నిత్యావసర వస్తువులు కూడా తీసుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. పొలాలు నీట మునిగి, పంటలు కుళ్లిపోయాయి, రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. గతంలో సంభవించిన తుపానులు, ఏలేరు వరదల సమయంలోనూ బాధిత రైతులకు తగిన పరిహారం అందలేదని గీత విమర్శించారు. ప్రస్తుతం పంట నష్టాలను అంచనా వేసేందుకు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించడం లేదని అన్నారు. తుపాను ప్రభావిత గ్రామాల్లో అధికారులు పర్యటించి, నష్టాలను సమగ్రంగా అంచనా వేయాలని, బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్నికల విధుల్లో అధికారులు నిమగ్నమై ఉన్నందున ఇప్పటి వరకూ జరిగిన జాప్యాన్ని అర్థం చేసుకున్నప్పటికీ, ఇకనైనా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత అధికారులను గ్రామాలకు పంపించాలని కోరారు. రైతులకు పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించే విధానం అమలు చేయాలని గీత సూచించారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పెదపాటి రాజేష్ కుమార్, మాజీ కౌన్సిలర్ తలిశెట్టి వెంకటేశ్వరరావు, నాయకులు కొత్తెం దత్తుడు, అలీ, పవన్ కుమార్, రాష్ట గ్రీవెన్స్ సెల్ సెక్రటరీ ముమ్మిడి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.


