పెద్దాపురం: పరిషత్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పెద్దాపురం మహారాణి డిగ్రీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రంలో చేసిన ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలో వసతులు, రిసెప్షన్ సెంటర్, మండలాల వారీగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు గదులు, టేబుల్స్ తదితర ఏర్పాట్లను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం జరుగుతుందని చెప్పారు. ప్రతి మండలానికీ స్ట్రాంగ్ రూము పక్కనే ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రియ, జిల్లా పరిషత్ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు, డిప్యూటీ సీఈవో డి.శ్రీలలిత, పెద్దాపురం ఎంపీడీవో కేవీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్ 12న
జాతీయ లోక్ అదాలత్
పెద్దాపురం: హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు పెద్దాపురం ఏడో అదనపు జిల్లా జడ్జి ఎన్.సరస్వతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో సివిల్ తగదాలు, చెక్ బౌన్స్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటారు వాహన ప్రమాద పరిహార కేసులు, బ్యాంకు, విద్యుత్, టెలిఫోన్ బిల్లుల వంటి ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించుకోవచ్చని వివరించారు. కక్షిదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు
కాకినాడ క్రైం: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జి.వీరపాండియన్ కాకినాడ జీజీహెచ్‌లో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తుపాను అనంతరం కొనసాగుతున్న వైద్య సేవలు, పునరుద్ధరణ పనులను పర్యవేక్షించారు. ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న నూతన భవనాలను, శిథిలావస్థకు చేరిన భవనాలను పరిశీలించారు. మెడికల్ స్టోర్స్‌ను సందర్శించి ఔషధాల అందుబాటు, రోగులకు అందిస్తున్న తీరును పరిశీలించారు. ఫార్మసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పసుపులేటి శ్రీనివాస్, సూపరింటెండెంట్ లావణ్య కుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాసన్, ఆర్‌ఎంవో మెహర్ తదితరులు పాల్గొన్నారు.


