నామినేషన్లకు తెర | - | Sakshi
Sakshi News home page

నామినేషన్లకు తెర

Oct 24 2026 5:47 AM | Updated on Oct 24 2026 5:47 AM

● చివరి రోజూ భారీగా నామినేషన్లు

● జెడ్పీ, మండల పరిషత్‌

కార్యాలయాల్లో సందడి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారం ముగిసింది. చివరి రోజు కావడంతో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారితో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. జెడ్పీటీసీ నామినేషన్లకు తరలి వచ్చిన వారితో జెడ్పీ కార్యాలయంలో సందడి నెలకొంది. అభ్యర్థులు ఉదయం 10.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకూ తమ నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌కు సమర్పించారు. నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు భారీ సంఖ్యలో రావడంతో వారికి టోకెన్లు జారీ చేశారు. సాయంత్రం 5 గంటల వరకూ నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండటంతో ఆలోగా వచ్చిన వారందరికీ టోకెన్లు జారీ చేసి, క్రమ పద్ధతిలో నామినేషన్లు స్వీకరించారు. జిల్లాలోని మండల పరిషత్‌ కార్యాలయాల్లో కూడా ఎంపీటీసీ నామినేషన్ల దాఖలుకు వచ్చిన అభ్యర్థులతో కోలాహలం నెలకొంది.

జెడ్పీటీసీలకు 230 నామినేషన్లు

జిల్లాలోని 20 జెడ్పీటీసీలకు మొత్తం 230 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వైఎస్సార్‌ సీపీ నుంచి 56 మంది, జనసేన 81, టీడీపీ 37, బీఎస్పీ 5, బీజేపీ 16, కాంగ్రెస్‌ 14, వామపక్షాలు, ఇతరులు 21 చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు.

ఎంపీటీసీలకు 2,218 మంది..

జిల్లాలోని 401 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతూండగా మొత్తం 2,218 నామినేషన్లు వేశారు. వైఎస్సార్‌ సీపీ నుంచి 871 మంది, టీడీపీ 656, జనసేన 471, బీజేపీ 50, కాంగ్రెస్‌ 6, ఆమ్‌ ఆద్మీ పార్టీ 1, బీఎస్పీ 5, వామపక్షాలు 9, స్వతంత్రులు 146, బీసీవై నుంచి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు.

కూటమిలో కుదరని సీట్ల సర్దుబాటు

జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అధికార కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. దీంతో, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎవరికి వారుగా నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల ఎంపిక కూటమి పార్టీలకు తలనొప్పిగా మారింది. జెడ్పీటీసీ స్థానాల కేటాయింపుపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య స్పష్టత రానప్పటికీ ఆశావహులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తమకే పార్టీ టికెట్టు వస్తుందన్న ఆశతో పలువురు నాయకులు నామినేషన్లు వేశారు. దీంతో, అనేక మండలాల్లో కూటమి పార్టీలకు చెందిన అభ్యర్థులు పరస్పరం బరిలో నిలుస్తున్న పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కాకినాడ రూరల్‌, యు.కొత్తపల్లి, సామర్లకోట తదితర మండలాల్లో టీడీపీ, జనసేన నాయకులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. పెద్దాపురం జెడ్పీటీసీ స్థానానికి సైతం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు నామినేషన్లు వేశారు. సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడం కూటమి పార్టీల కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తోంది. మరోవైపు వైఎస్సార్‌ సీపీ పలు మండలాల్లో జెడ్పీటీసీ అభ్యర్థులను ముందుగానే ఖరారు చేసింది. దీంతో, ఆ పార్టీ అభ్యర్థులు ఎటువంటి టెన్షన్‌ లేకుండా నామినేషన్లు వేశారు.

ఉపసంహరణపై ఆసక్తి

నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు రాజకీయ పార్టీల దృష్టి బరిలో నిలిచిన అభ్యర్థులపై పడింది. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి. ఒకే స్థానంలో నామినేషన్లు వేసిన కూటమి అభ్యర్థుల్లో ఎవరు వెనక్కి తగ్గుతారు, రెబల్‌ అభ్యర్థులను బుజ్జగించగలరా అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లను శనివారం పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 27 ఆఖరు తేదీ. అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లు ఖరారు చేస్తారు. నవంబర్‌ 3న ఎన్నికలు నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement