● జీఓ 291ని సస్పెండ్ చేసిన హైకోర్టు
● వెల్లడించిన వైఎస్సార్ సీపీ నేత దవులూరి దొరబాబు
సామర్లకోట: పేదల ఇళ్ల స్థలాల్లో పరిశ్రమ ఏర్పాటు చేసే ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. వివరాలి వీ.. పెద్దాపురం మండలంలోని 11 గ్రామాల పేదలకు రామేశ్వరం మెట్ట వద్ద గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చింది. ఇక్కడ రెండో విడతలో ఇళ్ల నిర్మా ణం చేపట్టాల్సి ఉండగా 2024లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జిల్లాలో జిందాల్ సంస్థ ఆధ్వర్యాన చెత్త నుంచి విద్యుత్తు తయారు చేసే పరిశ్రమ స్థాపించాలని నిర్ణయించింది. దీనికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు అంగీకరించకపోగా, పెద్దాపురంలో ఈ పరిశ్రమ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. దీంతో, రామేశ్వరం మెట్ట వద్ద గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలాల వద్ద జిందాల్ పరిశ్రమ నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం జీఓ 291 జారీ చేసింది. ఆ వెంటనే పరిశ్రమ నిర్మాణం ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు జిందాల్ అధికారులకు వాస్తవాలు తెలిపి, పరిశ్రమ నిర్మాణం నిలిపివేయాలని సూచించారు. స్పందన లేకపోవడంతో ఆ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు పొందిన వారితో కలసి పెద్దాపురం ఆర్‌డీఓ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించి, ఆర్‌డీఓకు వినతిపత్రం అందజేశారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పేదల తరఫున దొరబాబు హైకోర్టును ఆశ్రయించారు. విషయాన్ని పరిశీలించిన హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను శుక్రవారం సస్పెండ్ చేసిందని ఆయన విలేకర్లకు తెలిపారు. పేదలకు తాత్కాలిక రక్షణ లభించిందని, నవంబర్ 25న తుది తీర్పు వస్తుందని తెలిపారు. కాగా, జిందాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు పార్టీల నాయకులు కూడా ఆందోళనలు నిర్వహించారు.


