● అప్పటి వరకు నీకు నోరెత్తే అర్హత లేదు
● అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానం
చెప్పలేక అవాకులు చెవాకులు
● నిప్పులు చెరిగిన
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘కేంద్రం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలే ఉన్నాయి. కొచ్చిన్ డ్రగ్స్ కేసులో నాపై వచ్చిన ఆరోపణలకు సీబీఐతో విచారణ చేయించి, నిజాలు నిగ్గుతేల్చు. విచారణ పూర్తయ్యేదాకా నోరెత్తి విమర్శించే అర్హత నీకు లేదు. పసలేని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు’ అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నిప్పులు చెరిగారు. తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలోలాయన మాట్లాడారు. డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై దమ్ముంటే సీబీఐ విచారణ వేయించుకోవాలే తప్ప పస లేని ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. కొండబాబు అవినీతిపై తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, తీవ్ర ఒత్తిడికి లోనై దిక్కు తోచని స్థితిలో అవాకులు చెవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు. న్యాయబద్ధంగా సంపాదించుకుంటే ఎవరూ ప్రశ్నించరని, నీ చీకటి వ్యాపారాలేమిటో ప్రజలకు తెలుసని ఆయనన్నారు.
నీ రాజకీయానికి పునాది వేసిందే నేను
‘నీ రాజకీయ జీవితానికి పునాది వేసి, నిన్ను తెర పైకి తెచ్చిందే నేను. 2024 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఇమేజ్, ఈవీఎంల సహకారంతో గట్టెక్కి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నావా?’ అంటూ ద్వారంపూడి ధ్వజమెత్తారు. నగరంలో అడుగడుగునా ‘కొండబాబు ట్యాక్స్’ దందాయే రాజ్యమేలుతోందన్నారు. మద్యం దుకాణాల్లో ఎంఆర్‌పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతూ జనాన్ని నిలువునా దోచుకుంటున్నారన్నారు. ‘నగర ప్రజలు ఆహ్లాదంగా గడిపే ఎగ్జిబిషన్ నిర్వాహకుల నుంచి రూ.30 లక్షలు నొక్కేసింది నిజం కాదా? గతంలో ఒక్కొక్కరికి రూ.30 ఉన్న టికెట్ ఇప్పుడు రూ.80కి ఎందుకు చేరింది?’ అని ద్వారంపూడి ప్రశ్నించారు. వెంటనే ఎగ్జిబిషన్ టికెట్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు. చివరకు రక్షణ కల్పించే పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి, పెట్రోలు బంకులు, రేషన్ షాపుల నుంచి కూడా వసూళ్లకు తెగబడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ‘2014లో అప్పుల్లో ఉన్న నువ్వు ఎమ్మెల్యే అయ్యాక ధనవంతుడివి ఎలా అయ్యావ్? ఆ అప్పు ఎలా తీర్చావ్?’ అని ప్రశ్నించారు. ప్రజలను దోపిడీ చేయడం మాని, నీతిగా సంపాదించుకోవాలని హితవు పలికారు. కాకినాడ సిటీలో ఇంత అవినీతి ఎమ్మెల్యేని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. చివరకు తిరుమల టికెట్లు సైతం అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. సింహాచలానికి తాను పాదయాత్రగా వెళ్తే విమర్శలు చేయడం దారుణమని మండిపడ్డారు.
అమ్మకానికి కార్పొరేటర్ టిక్కెట్లు
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలంటే కొండబాబుకు పండగలా కనిపిస్తోందని, ఇప్పటి నుంచే కార్పొరేటర్ టిక్కెట్లకు బేరాలు పెట్టి మరీ వసూళ్లకు తెర తీశారని ద్వారంపూడి ఆరోపించారు. ‘కాకినాడ పో ర్టులో అన్ని రకాల సౌకర్యాలూ ఉన్నప్పటికీ, నీ బ్లా క్‌మెయిల్ దందాల వల్లే రా రైస్ (ముడి బియ్యం) ఎగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా వేలాది మంది కార్మికులు రోడ్డున పడి అల్లాడుతున్నారు’ అని మండిపడ్డారు. ఏటిమొగ నుంచి మూడో వంతెన పేరుతో ఏమాత్రం అవసరం లేకపోయినా భూసేకరణ కోసం ఏకంగా రూ.300 కోట్లు కాజేయాలని పన్నిన కుట్రను అడ్డుకోవడంతో ప్రజాధనం మిగిలిందని ద్వారంపూడి చెప్పారు.


