నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): హాకీ ఇండియా సహకారంతో కోకనాడ కోస్టర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే ఖేలో ఇండియా మహిళా సౌత్ జోన్ హాకీ పోటీలకు కాకినాడ వేదిక కానుంది. ఈ నెల 27 నుంచి నవంబరు 6 వరకు జరిగే ఈ పోటీల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, కోకనాడ కోస్టర్ స్పోర్ట్స్ క్లబ్, ఆడిటి అనంతపురం జట్లు పాల్గొంటున్నాయి. తొలిసారి ఈ పోటీలు కాకినాడలో జరుగుతుండడంతో నిర్వాహకులు వివిధ కమిటీలను ఏర్పాట చేసి నిర్వహణ ఏర్పాట్లు మొదలు పెట్టారు. పోటీల నిర్వహణ కమిటీ చీఫ్ ప్యాట్రన్‌గా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, నిర్వహణ కార్యదర్శిగా ఒలింపియన్ రజని, కమిటీ ఉపాధ్యక్షురాలిగా సుధారాణి వ్యవహరిస్తున్నారు. సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగంలో ప్రతి రోజు నాలుగు మ్యాచ్‌లు నిర్వహిస్తారు. 30 మంది సాంకేతినిక నిపుణులు, 70 లోకల్ ఆఫీషియల్స్ పోటీల నిర్వహణ ఏర్పాట్లలో విధులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కోకనాడ కోస్టర్ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకుడు రవిచంద్ర శనివారం డీఎస్‌ఏలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కోకనాడ కోస్టర్ స్పోర్ట్స్ క్లబ్ ఇటీవల హైదరాబాద్‌లో డిపార్డ్మెంట్ హాకీ పోటీలు నిర్వహించిందన్నారు. హాకీ ఇండియాలో ఆఫిలియేటెడ్ క్లబ్ కావడంతో హాకీ ఇండియా ఈ టోర్నమెంట్ నిర్వహణను కోకనాడ కోస్టర్ స్పోర్ట్స్ క్లబ్‌కు కేటాయించిందన్నారు. వుమెన్ ఎంపవర్మెండ్, మహిళా క్రీడాకారిణులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మినిస్టర్ ఆఫ్ యూత్ ఎఫైర్స్ పర్యవేక్షణలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పోటీలు నిర్వహిస్తుందన్నారు. సమావేశంలో కోకనాడ కోస్టర్ స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు బాబ్జీ, సుధారాణి, సూరిబాబు, రాజు పాల్గొన్నారు.
27 నుంచి ఖేలో ఇండియా
మహిళా సౌత్ జోన్ పోటీలు
5 రాష్ట్రాల నుంచి క్రీడాకారుల హాజరు
కోకనాడ కోస్టర్ స్పోర్ట్స్ క్లబ్‌కు
నిర్వహణ బాధ్యతలు


