సాక్షి, ప్రతినిధి, కాకినాడ: కూటమిలో కమలం కుమిలిపోతోంది.. పట్టణ పోరులో ప్రధాన మిత్రపక్షమైన బీజేపీకి భంగపాటు ఎదురైంది.. సీట్ల సర్దుబాటు విషయంలో అన్యాయాన్ని తలచుకుని అగ్గి మీద గుగ్గిలమవుతోంది.. ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేకపోవడంతో సొంత బలాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది.. తమకు బలమున్న చోట ఒంటరి పోరుకు సమాయత్తమవుతోందని రాజకీయ విశ్లేషకులు, కొందరు బీజేపీ శ్రేణులు అంటున్నారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమిలోని ప్రధాన నేతలు సీట్ల సర్దుబాటుపై మేధోమథనం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా (కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి) 12 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో జనసేనకు ఏడు మున్సిపాలిటీలు కేటాయించిన చంద్రబాబు, మిత్రపక్షమైన బీజేపీకి మాత్రం ఒక్క మున్సిపల్ చైర్మన్ స్థానం సైతం ఇవ్వలేదు. నిర్ణయం ఆయా పార్టీల రాష్ట్ర నేతల సమక్షంలో జరిగినా.. జిల్లా నేతలు, పార్టీ శ్రేణులు మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ నేతలను చంద్రబాబు ఏటీఎంలా వాడుకోవడమే తప్ప తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తమకున్న బలానికి అనుగుణంగా సీట్లు కేటాయించాలని బీజేపీ నేతలు కోరినా.. టీడీపీ నేతలు అంగీకరించకపోవడంపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. పైగా రాష్ట్ర స్థాయిలో నిర్ణయించిన వాటా ప్రకారమే జిల్లాలోనూ సీట్లు కేటాయిస్తామని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ పరిణామం బీజేపీ జిల్లా నేతల్లో అసంతృప్తికి ఆజ్యం పోసినట్లు సమాచారం.
వార్డు కౌన్సిలర్లలోనూ అదే తంతు..!
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 378 వార్డులు ఉన్నాయి. ఇందులో ఒక్క వార్డు సైతం బీజేపీకి అధికారికంగా కేటాయింపులు చేసిన దాఖలాలు లేవు. అనధికారికంగా అయినా సర్దుబాటు చేస్తారా..? అంటే ఆ ఊసెత్తడం లేదన్న వాదన వినిపిస్తోంది. అన్ని వార్డుల్లోనూ టీడీపీ, జనసేన నేతలు సర్దుబాట్లు చేసుకోవడంలోనే మునిగితేలుతున్నారు తప్ప.. కమలనాథులపై కన్నెత్తి చూడటం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. కూటమంటే.. కేవలం జనసేన, టీడీపీనేనా..? అని బీజేపీ నేతలు నిట్టూర్పు వదులుతున్నారు. బహిరంగంగా ప్రశ్నిస్తే పార్టీ అధినాయకత్వంతో తలనొప్పులు తప్పవని భావించి లోలోన మదన పడుతున్నట్లు సమాచారం. అభివృద్ధి కార్యక్రమాల సమయంలో గుర్తుకొస్తున్న బీజేపీ నేతలు ఎన్నికల సమయంలో ఎందుకు గుర్తుకురావడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆ ఒక్కటితో సరి
సీట్ల సర్దుబాటులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేవలం రాజమహేంద్రవరం మేయర్ స్థానం మాత్రమే బీజేపీకి కేటాయించారు. అది కూడా ప్రస్తుతం ఎన్నికలకు దూరంగా ఉన్న స్థానం. ఎన్నికలకు అనేక చిక్కులున్న కార్పొరేషన్ కేటాయింపులపై బీజేపీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు.
ఒంటరి పోరుకు సిద్ధం..?
జిల్లా మున్సి వార్డులు బీజేపీకి
పాలిటీలు కేటాయింపు
కాకినాడ 06 191 0
తూర్పుగోదావరి 03 96 0
కోనసీమ 03 91 0
ఫ పట్టణ పోరులో వికసించని ‘కమలం’
ఫ కూటమిలో కుమిలిపోతున్న బీజేపీ
ఫ ఉమ్మడి జిల్లాలో కేవలం
ఓ కార్పొరేషన్తో సరి
ఫ అదీ ఎన్నికలు జరగవని తెలిసి
రాజమహేంద్రవరం
మేయర్ స్థానం కేటాయింపు
ఫ ఒక్క వార్డు కౌన్సిలర్ స్థానం
ఇవ్వని వైనం
టీడీపీ, జనసేన నేతల నుంచి ఆశించిన మేర సీట్ల సర్దుబాట్లు కాకపోవడంతో తమ దారి తాము చూసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. వారికి సొంత బలం ఉన్న వార్డుల్లో నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో పార్టీకి బలం ఉన్నచోట అభ్యర్థులను బరిలోకి దించాలని పార్టీ అధినాయకత్వం ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కూటమిలో భాగస్వామిగా ఉన్నా తమకు తగిన రాజకీయ ప్రాధాన్యం కల్పించడం లేదనే భావనతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పొత్తుల కోసం ఎదురుచూస్తూ పార్టీ శ్రేణులను నిరుత్సాహపరచడం కంటే.. సొంతంగా పోటీ చేసి బలాన్ని నిరూపించుకోవడమే ఉత్తమమని భావిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అక్కడక్కడ నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిసింది. నేటితో నామినేషన్ల గడువు ముగియనుండటంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను ముందుగానే సమకూర్చుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బలం ఉన్నచోట మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్, జెడ్పీటీసీ ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించే పనిలో నిమగ్నమైనట్లు తెలిసింది. అక్కడ పోటీకి సిద్ధమవ్వాలని కార్యకర్తలకు అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఒంటరిగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చినప్పటికీ టీడీపీ నాయకత్వం నుంచి సంతృప్తికరణమైన సీట్ల కేటాయింపు ప్రతిపాదన వస్తే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జిల్లా నేతలు చెబుతున్నారు. సీట్ల కేటాయింపులో తమకు సంతృప్తికర నిర్ణయం జరిగితే నామినేషన్ల ఉపసంహరణపై ఆలోచిస్తామని పేర్కొంటున్నారు. నామినేషన్లకు ఒక రోజు మాత్రమే ఉండటంతో చివరి నిమిషంలో సీట్ల సర్దుబాటుపై బీజేపీ, జనసేన, టీడీపీలో ఏకాభిప్రాయం వస్తుందా..? బీజేపీ అభ్యర్థులు స్వతంత్రంగా బరిలోకి దిగుతారా..? అనేది తేలాల్సి ఉంది.


