సామర్లకోట: పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అనుచరుడు నూతాటి అశోక్ సామర్లకోట మున్సిపల్ చైర్మన్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వు అయ్యింది. దాంతో చైర్మన్ టిక్కెట్ కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించారు. కాగా ఎమ్మెల్యేకు సన్నిహితుడిగా ఉన్న అశోక్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో జనసేనలో గుబులు రేగుతోంది.
నిబంధనలు గాలికి..
రారు వారి జోలికి
పెద్దాపురం: ఎన్నికల వేళ అధికార పార్టీ నేతలే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. అయినా పోలీసులు చోద్యం చూస్తున్నారు. పెద్దాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా శనివారం రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా కూటమి నేతలు అడుగడుగునా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. 144 సెక్షన్ అమల్లో ఉందని హెచ్చరికలు జారీ చేసినా, రాజకీయ పార్టీల నాయకులు పట్టించుకోలేదు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా భారీ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా కూటమి నాయకులు పెడచెవిన పెట్టారు. నియోజకవర్గానికి ప్రాతినిత్యం వహిస్తున్న ఓ ప్రజాప్రతినిధి నేరుగా మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లి, కమిషనర్ గదిలో కూర్చోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
స్థానిక సంస్థల
ఎన్నికలకు పటిష్ట భద్రత
కాకినాడ క్రైం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియమావళి ఉల్లంఘనకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ స్పష్టం చేశారు. జిల్లాలో ఈ నెల 28న పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, తుని, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఎన్నికల విధుల కోసం అవసరమైన మేరకు పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, తనిఖీ కేంద్రాలు, షాడో పార్టీలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. కోరింగ పీఎస్ పరిధిలో పి.మల్లవరం, కరప పోలీస్స్టేషన్ పరిధిలోని వెలంపేట, గండేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని రామేశంపేట, మురారి గ్రామాల మధ్య 5 ఎన్నికల చెక్ పోస్టులు ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల వేళ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న 1,418 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. సమస్యలు, ఫిర్యాదుల కోసం 94906 19297, డయల్ 112ను నంబరును సంప్రదించాలని కోరారు.
మమ్మేలు.. మహాలక్ష్మి
అమలాపురం టౌన్: దేవీ శరన్నవ రాత్రి మహోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శనివారం అమలాపురం శ్రీదేవి ఆలయంలో అమ్మవారు శ్రీమహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు.


