అసమ్మతి సెగలు | - | Sakshi
Sakshi News home page

అసమ్మతి సెగలు

Oct 17 2026 6:36 AM | Updated on Oct 17 2026 6:36 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: మున్సిపల్‌ ఎన్నికల సీట్ల సర్దుబాటుపై కూటమిలో చెలరేగిన అసమ్మతి సెగలు చల్లారడం లేదు. టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌లు తమ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలు క్షేత్ర స్థాయి నేతల్లో ఆగ్రహావేశాలు నింపుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. తమకు దక్కాల్సిన మున్సిపల్‌ పీఠాన్ని తన్నుకుపోతున్నారంటూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తమను కాదని ఎలా పోటీ చేస్తారో, ఎలా గెలుస్తారో చూస్తామంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. కూటమి నిర్ణయాన్ని సైతం ధిక్కరిస్తున్నారు. రెబల్‌ అభ్యర్థులుగా రంగంలోకి దిగుతామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామం రెండు పార్టీలకు తలనొప్పిగా మారింది.

గొల్లప్రోలులో తిరుగుబాటు

సీట్ల సర్దుబాటులో భాగంగా గొల్లప్రోలు మున్సిపాలిటీ చైర్మన్‌ స్థానాన్ని జనసేనకు కట్టబెట్టడం టీడీపీ శ్రేణుల్లో అసమ్మతి చిచ్చు రగిల్చింది. ఏళ్ల తరబడి టీడీపీ కోసం శ్రమిస్తూంటే.. చైర్మన్‌ స్థానాన్ని జనసేనకు కేటాయించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. టీడీపీలో తమకు కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వకపోవడంతో రోడ్డెక్కారు.

తమను అవసరానికి వాడుకుని ఇప్పుడు బయటకు పొమ్మంటారా అంటూ అధిష్టానం తీరుపై మండిపడుతూ తిరుగుబాటు అస్త్రం సంధించారు. ఈ అన్యాయానికి మంత్రి లోకేష్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మున్సిపాలిటీలోని 23 వార్డుల్లోనూ రెబల్‌ అభ్యర్థులుగా రంగంలోకి దిగుతామని ప్రకటించి, మిత్రపక్షం జనసేనకు కూడా షాక్‌ ఇచ్చారు. శని, ఆదివారాల్లో నామినేషన్లు వేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నామని వెల్లడించారు.

సామర్లకోటలో సై అంటే సై

సామర్లకోట మున్సిపాలిటీ తమకే దక్కుదని టీడీపీ శ్రేణులు భావించగా.. జనసేనకే కేటాయించడంతో ఒక్కసారిగా భంగపాటుకు గురయ్యారు. పార్టీ కోసం కష్టపడిన తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా గ్లాసు పార్టీకి ఎలా కేటాయిస్తారంటూ మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలనే డిమాండుతో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలు రోడ్డెక్కారు. చైర్మన్‌ పీఠం తమకు దక్కాల్సిందేనని, అధిష్టానం నుంచి సరైన నిర్ణయం వెలువడే వరకూ కదలబోమని హెచ్చరించారు. ఈ తరుణంలో లంక భగవాన్‌ అనే కార్యకర్త ఒంటిపై పెట్రోలు పోసుకుని హంగామా చేశాడు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. ఇదిలా ఉండగా తమ పార్టీలోనే తమకు అవమానం జరిగిందని, ఈ ఎన్నికలకు దూరంగా ఉంటామని టీడీపీ నేతలు వెల్లడించారు.

తునిలో సీన్‌ రివర్స్‌

తుని మున్సిపల్‌ పీఠం కేటాయింపులో సీన్‌ రివర్స్‌ అయింది. టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడి సొంత నియోజకవర్గంలోనే ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తుని మున్సిపాలిటీ చైర్మన్‌ స్థానం తమకే దక్కుతుందని టీడీపీ నేతలు భావించారు. కానీ, దీనిని జనసేనకు కట్టబెట్టడంతో వారికి భంగపాటు తప్పలేదు. ఇక్కడ టీడీపీ నుంచి చైర్మన్‌ కుర్చీ ఆశించిన మళ్ల గణేష్‌ దంపతులు రాత్రికి రాత్రి జనసేనలో చేరిపోయారు. అనంతరం గణేష్‌ భార్య మీనాక్షిని చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా జనసేన ప్రకటించింది.

ఫ సీట్ల సర్దుబాటుపై కూటమిలో చిచ్చు

ఫ గొల్లప్రోలు జనసేనకా?

ఫ టీడీపీ నేతల తిరుగుబాటు

ఫ అన్ని వార్డుల్లోనూ పోటీ చేస్తామని ప్రకటన

ఫ తుని, పిఠాపురాల్లో అభ్యర్థుల కరువు

ఫ ఎస్సీలకు న్యాయం చేయాలంటూ

సామర్లకోటలో రోడ్డెక్కిన నేతలు

పిఠాపురంలో టీడీపీ దుకాణం బంద్‌

పిఠాపురం మున్సిపాలిటీలో టీడీపీ దుకాణం క్రమంగా బంద్‌ అవుతోంది. ఇప్పటికే కీలక పదవులన్నీ జనసేన నేతలకే దక్కడంతో నియోజకవర్గంలో అసలు టీడీపీ ఉందా అనే అనుమానం కలుగుతోందని ఆ పార్టీ శ్రేణులు అంతర్గతంగా ఆవేదన చెందుతున్నాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తూండటం, టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మను సైతం పక్కన పెట్టేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement