కొలిక్కిరాని కసరత్తు | - | Sakshi
Sakshi News home page

కొలిక్కిరాని కసరత్తు

Oct 17 2026 6:36 AM | Updated on Oct 17 2026 6:36 AM

వైఎస్సార్‌ సీపీలో జోష్‌

మరోవైపు మున్సి పల్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వైఎస్సార్‌ సీపీ సన్నద్ధమవుతోంది. మున్సిపల్‌ చైర్మన్‌, వార్డు కౌన్సిలర్‌ స్థానాల్లో అభ్యర్థుల నియామకానికి వేగంగా అడుగులు వేస్తోంది. జిల్లావ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీల్లోనూ ఇప్పటికే అభ్యర్థులను సిద్ధం చేసింది. తుని మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌, మెజారిటీ వార్డు సభ్యుల జాబితాను వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఇప్పటికే ప్రకటించారు. వీరందరూ నామినేషన్లకు సిద్ధమవుతున్నారు. మిగిలిన మున్సిపాలిటీల్లో సైతం అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రజా వ్యతిరేక విధానాలు, దోపిడీకే ప్రాధాన్యం ఇస్తోంది. దీనిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకు ని ప్రజల్లోకి వెళ్లేందుకు వైఎస్సార్‌ సీపీ వ్యూహాలు రచిస్తోంది. దీనికి తోడు రెండున్నరేళ్లుగా ప్రజల సమస్యలపై వారి పక్షాన పోరాడుతూండటంతో ఆ పార్టీకి మంచి ఆదరణ లభిస్తోంది.

ఫ కూటమిలో తేలని

కౌన్సిలర్‌ అభ్యర్థుల ఎంపిక

ఫ నామినేషన్లు ప్రారంభమైనా

వీడని గందరగోళం

ఫ చైర్మన్‌ స్థానాల పైనే నేతల దృష్టి

ఫ సీట్ల సర్దుబాటుపై ఉత్కంఠ

సాక్షి ప్రతినిధి, కాకినాడ: పురపాలక పోరులో నామినేషన్ల ఘట్టం ఆరంభమై ఒక రోజు గడిచినా కూటమిలో వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థుల సర్దుబాటు వ్యవహారం కొలిక్కిరావడం లేదు. టీడీపీ, జనసేన నేతల మధ్య పొత్తుల వ్యవహారం కొలిక్కి రాకపోవడం.. మరోవైపు సర్దుబాటు తీరుపై టీడీపీ నేతలు ఆందోళనలకు దిగుతూండటంతో సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక కూటమి నేతలకు సవాలుగా మారుతోంది. దీనిపై పదవులు ఆశిస్తున్న నేతల్లో సర్వత్రా గందరగోళం నెలకొంది. త్వరగా అభ్యర్థులను ప్రకటించకపోతే ఎప్పుడు నామినేషన్లు దాఖలు చేయాలి.. ప్రచారం ఎప్పుడు చేసుకోవాలనే అయోమయాన్ని వారు ఎదుర్కొంటున్నారు.

పొత్తులో భాగంగా సామర్లకోట మున్సిపాలిటీ చైర్మన్‌ పదవిని జనసేనకు కేటాయించారు. కానీ, తెర వెనుక టీడీపీ పెద్ద మంత్రాంగమే నడుపుతోంది. మెజార్టీ వార్డులను తమ పార్టీ వారికే కట్టబెడుతోంది. సామర్లకోట మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులుండగా.. జనసేన 12 ఆశిస్తోంది. కానీ, ఆ పార్టీని ఎనిమిది వార్డులకే పరిమితం చేసి, మిగిలిన వాటిలో టీడీపీ నేతలు రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

పెద్దాపురం మున్సిపాలిటీలో 32 వార్డులుండగా.. ఇక్కడ కూడా జనసేనకు 8 వార్డులు మాత్రమే విదిలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏలేశ్వరం మున్సిపాలిటీలో చైర్మన్‌ అభ్యర్థి కోసం కుస్తీ పడుతున్నారు. ఇక్కడ జనసేనకు ఒక్క వార్డు కూడా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ నేతలు 3 వార్డులు అడుగుతున్నారు.

తుని మున్సిపాలిటీలో 36 వార్డులుండగా టీడీపీ, జనసేన నేతలు చెరి సగం వార్డుల్లో పోటీకి దిగనున్నట్లు సమాచారం. టీడీపీ కీలక నేత నియోజకవర్గంలోనూ జనసేన పోటీ చేసే పరిస్థితి తలెత్తిందని ‘పచ్చ’ నేతలు భగ్గుమంటున్నారు.

గొల్లప్రోలు పంచాయతీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జనసేనకు చైర్మన్‌ స్థానం కేటాయించడంతో మెజార్టీ కౌన్సిలర్‌ స్థానాలు తమకే ఇవ్వాలని టీడీపీ శ్రేణులు డిమాండ్‌ చేస్తున్నాయి.

పిఠాపురంలో అభ్యర్థుల ఎంపికకు టీడీపీ, జనసేన మల్లగుల్లాలు పడుతున్నాయని చెబుతున్నారు. ఇక్కడ పోటీ చేసేందుకు ఇరు పార్టీల నుంచి దాదాపు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఇతర పార్టీల నేతలకు ఆ పార్టీల తీర్థం ఇచ్చి, బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చైర్మన్‌ స్థానంపై ఇంకా స్పష్టత రాకపోవడాన్ని బట్టి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement