కాకినాడ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించినప్పటికీ ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలును అధికారులు పట్టించుకోవడం లేదు. కాకినాడ నగరంలో పలుచోట్ల అధికార కూటమి నేతల ఫొటోలతో ఫ్లెక్సీలున్నప్పటికీ తొలగించడం లేదు. కాకినాడ 42వ డివిజన్ స్వామి నగర్‌తో పాటు దుమ్ములపేట తదితర ప్రాంతాల్లో అధికార కూటమి నాయకుల ఫ్లెక్సీలు తొలగించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
తొలి రోజు
17 నామినేషన్లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, తుని, గొల్లప్రోలు, ఏలేశ్వరం మున్సిపాలిటీల్లోని 191 వార్డులకు తొలి రోజు 17 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ప్రక్రియ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో జరిగింది. పెద్దాపురం మున్సిపాలిటీలో వైఎస్సార్ సీపీ నుంచి 1, గొల్లప్రోలులో జనసేన నుంచి 6, పిఠాపురంలో టీడీపీ 2, ఏలేశ్వరంలో వైఎస్సార్ సీపీ నుంచి 1, తునిలో వైఎస్సార్ సీపీ నుంచి 6, టీడీపీ నుంచి ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు మంచి రోజు కావడంతో నామినేషన్లు జోరందుకునే అవకాశం ఉంది.
కలెక్టరేట్లో
కంట్రోల్ రూము ఏర్పాటు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ భవన్లో జిల్లా స్థాయి కంట్రోల్ రూము ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 89788 75559, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 89788 45559 మొబైల్ నంబర్లతో వీటిని ఏర్పాటు చేశారు. ఆయా ఎన్నికలకు సంబంధించిన ఏ సమాచారమైనా, ఫిర్యాదులైనా 24 గంటలూ పని చేసే ఈ కంట్రోల్ రూముకు తెలియజేయవచ్చని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఓటర్లకు ఎన్నికల్లో డబ్బులు, మద్యం, బహుమతులు పంచినా ఫిర్యాదు చేయవచ్చన్నారు.
ఆలయాల్లో భక్తులకు మెరుగైన సదుపాయాలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఆలయాల్లో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా దేవదాయ శాఖ అధికారి కవిటపు లక్ష్మీ సుధారాణి తెలిపారు. విశాఖపట్నం నుంచి బదిలీపై వచ్చిన ఆమె దేవదాయ శాఖ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. 1991లో ఆ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేసిన ఆమె విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పని చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆమెను దేవదాయశాఖ తనిఖీదారు వడ్డి ఫణీంద్ర కుమార్, నగరంలోని పలు ఆలయాలు, సత్రాలకు చెందిన ఈఓలు, కార్యాలయ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలుసుకుని అభినందనలు తెలిపారు.
పారదర్శకంగా
ధాన్యం సేకరణ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను రైస్ మిల్లర్లు అత్యంత వేగవంతంగా, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు. జిల్లాలోని రైస్ మిల్లుల యజమానులు, ప్రతినిధులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం సేకరణలో ఎలాంటి ఆలస్యం జరగకుండా మిల్లర్లు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. తక్షణం బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించాలని, ఒప్పంద ప్రక్రియలు పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన గోనె సంచులను కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని చెప్పారు. మిల్లుల వద్ద వాహనాల రద్దీ సమస్యలు తలెత్తకుండా, ధాన్యం బస్తాలు దింపడానికి హమాలీలను పెంచాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా పని చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సమావేశంలో పౌర సరఫరాల సంస్థ, పౌర సరఫరాలు, ఇతర శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు.


