ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు
పూసపాటిరేగ: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం కారు టైర్ పంక్చర్ కావడంతో పల్టీలు కొడుతూ సుమారు 50 అడుగుల దూరంలో ఎగిరి పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. రాజమహేంద్రవరం నుంచి ఉదయం 9 గంటల సమయంలో కారులో తమ స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొరివంక గ్రామానికి కుటుంబంతో గున్న రామానందం, భార్య గున్న లక్ష్మీబాయి, కుమార్తె గున్న శృతి కాత్యాయిని, కుమారుడు వెంకటసాయి సుమంత్‌లు బయల్దేరారు. పూసపాటిరేగ మండలం కోనాడ జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపైకి వచ్చేసరికి కారు ముందు టైర్ పంక్చరై పేలిపోవడంతో డివైడర్‌ను ఢీకొని రోడ్డు రెయిలింగ్ దాటి సుమారు 50 అడుగుల దూరంలో కారు పడింది. దీంతో వెనకసీటులో ఉన్న లక్ష్మీబాయికి, ఆమె కుమార్తె శృతి కాత్యాయిని తలకు బలమైన గాయాలయ్యాయి. వారిని విజయనగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. తూర్పుగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీలో రీసెర్చ్ డైరెక్టర్‌గా రామానందం పనిచేస్తున్నారు. కుమార్తె శృతి కాత్యాయిని హామియోపతి డాక్టర్ కోర్సు పూర్తిచేశారు. కుమారుడు వెంకటసాయి సుమంత్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.


