కాయకష్టం చేసుకుని జీవనం సాగిస్తున్న కార్మికుల పరిస్థితి కడు దుర్భరంగా మారింది.. ఎన్నికల సమయంలో అంత చేస్తాం.. ఇంత చేస్తామని కూటమి నేతలు చెప్పుకొచ్చినా, ఇప్పుడేమో ఆ హామీల మాట మరిచి, కాలకూట విషం కక్కుతున్నారు.. దీనిపై కార్మికుల్లో నిరసన జ్వాలలు రేగుతున్నాయి. సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 8న ‘సామూహిక రాయబారం’ పేరుతో నిరసన తెలపనున్నారు.
కపిలేశ్వరపురం: గత ఎన్నికల సమయంలో కూటమి నేతలు భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయి. సుమారు రెండున్నరేళ్ల చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆ హామీలు అమలు చేయకుండానే నెట్టుకొచ్చారు. దీనిపై అనేక సార్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాల్సిన కార్మిక శాఖామంత్రి ఉమ్మడి జిల్లా రామచంద్రవపురంలోనే ఉన్నప్పటికీ ఫలితం లేదని వారు వాపోతున్నారు. ‘చలో కార్మిక శాఖా మంత్రి నివాసం’ కార్యక్రమం ద్వారా ‘సామూహిక రాయబారం’ పేరుతో ఈ నెల 8న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనకు భవన నిర్మాణ కార్మికులు సమాయత్తమవుతున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2019 నాటికి కార్మిక శాఖ లెక్కల్లో భవన నిర్మాణ కార్మికులు 52 రకాల విభాగాల నుంచి అధికారికంగా 2.45 లక్షల మంది ఉండేవారు. ఇది కాస్తా కూటమి పాలనలో నేడు ఆ సంఖ్య 1.05 లక్షలకు తగ్గిపోయింది. బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికులకు అందించే సాయం మొత్తాలను 2016లో నిర్ణయించగా, పదేళ్ల తర్వాత సైతం అవే మొత్తాలను కొనసాగిస్తోంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రమాద బీమాగా రూ.10 లక్షలు, సహజ మరణానికి రూ. 2 లక్షలు, వివాహ సాయంగా రూ.50 వేలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రమాద బీమా, శాశ్వత అంగ వైకల్యానికి సాయం ఇవ్వడం లేదు. ఆయా రాష్ట్రాల్లో వలే పిల్లల చదువులకు ఉపకార వేతనాలు కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు. పరిహారాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోమని చెబుతుండటంతో ఆ పరిజ్ఞానం లేని కార్మికులు ఇబ్బంది పడుతున్నారు.
‘కూటమి’ వంచన ఇలా..
కూటమి ఎన్నికల హామీలో పేర్కొన్న బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ హామీని కార్మికుల పోరాటాలతో రెండేళ్ల తర్వాత కాని అమలు చేయలేదు. వెల్ఫేర్ బోర్డులో 9 రకాల సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం కేవలం ప్రసూతి సహాయం, వివాహ సహాయం, సహజ మరణం పొందినప్పుడు ఇచ్చే సాయం అనే మూడు పథకాలు మాత్రమే అమలు చేస్తుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కార్మికుని కుటుంబంలో వివాహ సమయంలో రూ.40 వేల ఆర్థిక సాయమందించేది. కూటమి ప్రభుత్వం 2026 మార్చి 1న పత్రికా ప్రకటనలో వివాహ సాయం రూ.40 వేలు ఇస్తున్నట్టు చెప్పినప్పటికీ, ఆచరణలో కేవలం రూ.20 వేలు మాత్రమే ఇస్తున్నారని కార్మిక సంఘ నాయకులు చెబుతున్నారు.
డిమాండ్లు ఇవీ...
బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డు ద్వారా గతంలో వలే 9 రకాల సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
పెరిగిన ధరలకు అనుగుణంగా పరిహారాలు పెంచాలి.
ప్రమాద బీమా, శాశ్వత అంగవైకల్యం, చిన్నారుల చదువులకు ఉపకార వేతనాలు అమలు చేయాలి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు రూ.5 కోట్ల పెండింగ్ పరిహారాలు తక్షణం అందించాలి.
కేరళ రాష్ట్రం వలే 50 ఏళ్ల వయస్సు దాటిన వారందరికీ రూ.ఐదు వేలు పెన్షన్ ఇవ్వాలి.
వెంటాడుతున్న సమస్యలు
భవన నిర్మాణ కార్మికుల్లో ఆగ్రహం
8న ‘చలో కార్మిక శాఖామంత్రి నివాసం’
రామచంద్రపురం వెళ్లేందుకు సమాయత్తం
‘సామూహిక రాయబారం’ పేరుతో నిరసన
పోరాటమే శరణ్యం
ప్రభుత్వానికి అనేక రూపాల్లో మా డిమాండ్లను విన్నవించాం. కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉమ్మడి జిల్లాకు చెందిన వారే కావడంతో సామూహిక రాయభారం పేరుతో రామచంద్రపురంలోని ఆయన నివాసానికి వెళ్లేందుకు నిర్ణయించాం. 8న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. తమ సమస్యలన్నీ పరిష్కరించాలని కోరతాం.
– చెక్కల రాజ్‌కుమార్, ఉమ్మడి జిల్లా
సంక్షేమ బోర్డు స్క్రూట్నీ కమిటీ సభ్యుడు, సీఐటీయూ నాయకుడు, కాకినాడ


