సిలిండర్‌ను తొలగించడంతో
తప్పిన పెను ప్రమాదం
ప్రత్తిపాడు రూరల్: మండలంలోని ధర్మవరం గ్రామంలో పానీపూరి బండి నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సాయంత్రం వేళ కావడంతో పానీపూరి బండి వద్ద వినియోగదారులు గుమిగూడగా.. అదే సమయంలో రహదారిపై వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. అంతా ప్రశాంతంగా ఉందనుకునేలోపే ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి క్షణాల్లో బండి మొత్తానికి వ్యాపించాయి. మంటలను చూసిన స్థానికులు, వాహనదారులు భయంతో పరుగులు తీశారు. పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై సమీపంలోని నీరు, ఇసుకతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్‌ను సకాలంలో సురక్షితంగా వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అక్కడున్న వారు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో పానీపూరి బండి పూర్తిగా దగ్ధమైంది.


