కోటనందూరు: సరిగ్గా చదువుకోవడం లేదంటూ తల్లి మందలించడంతో ఓ విద్యార్థి అదృశ్యమైన సంఘటన కోటనందూరులో చోటు చేసుకుంది. ఎస్సై టి.రామకృష్ణ కథనం ప్రకారం.. స్థానిక భద్రంపేటకు చెందిన మామిడి ఉపేంద్ర (12) బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఉపేంద్ర తల్లి మాధవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉపేంద్ర స్థానిక జెడ్పీ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. చదువుపై ఆసక్తి లేని అతడిని తల్లి తరచూ మందలించేది. ఈ నేపథ్యంలో అతడు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలుడి ఆచూకీ తెలిస్తే 94409 00773 నంబరుకు తెలియజేయాలని ఎస్సై కోరారు.
చెరువులో ఆటో బోల్తా
గండేపల్లి: ఓ ఆటో అదుపు తప్పి, చెరువులో బోల్తా కొట్టిన ఘటన మండలంలోని యర్రంపాలెం – సూరంపాలెం మధ్య గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రహదారిపై గోతులు, దీనికి వర్షం కూడా తోడవడంతో ఆ ఆటో అదుపు తప్పి చెరువులో బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్, ఓ మహిళ ప్రయాణికురాలు ఉన్నారు. అదే సమయంలో అటుగా వెళుతున్న గండేపల్లి ఎంపీడీఓ కె.హరికృష్ణ సత్యారెడ్డి, ఇతర ప్రయాణికులు, స్థానికులు ఆటోలో చిక్కున్న వారిని బయటకు తీశారు. ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
బంకులో పెట్రోలుకు బదులు నీరు
అమలాపురం టౌన్: బాటిల్ తీసుకుని ఓ వినియోగదారుడు బంకుకు వెళ్లి పెట్రోలు పోయింకుంటూంటే పంపు నుంచి పెట్రోలుకు బదులు నీరు రావడంతో అవాక్కయ్యాడు. స్థానిక ఎర్ర వంతెన సమీపంలోని పెట్రోలు బంకులో గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది. దీనిపై అతడు బంకు సిబ్బంది ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.


