ఏలేశ్వరంలో వర్షపు నీటితో మునిగిన రహదారి
పిఠాపురం/బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ)/అన్నవరం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా తడిసి ముద్దయ్యింది. రోడ్లను, లోతట్టు కాలనీలను వాననీరు ముంచెత్తింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం బుధవారం నాటికి భారీగా మారి ఏకధాటిగా కురుస్తూనే ఉంది.
84 మిల్లీమీటర్ల వర్షపాతం
జిల్లావ్యాప్తంగా సగటున 84 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైందని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వ్యవధిలోనే మరో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు. జిల్లాలో అత్యధికంగా తాళ్లరేవు మండలంలో 63.6, అత్యల్పంగా కోటనందూరులో 17.6 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. వాయుగుండం ప్రభావంతో గురువారం కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. తీరం వెంబడి 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వానలు వాణిజ్య పంటలకు ఊపిరి పోశాయి. వరి పంటకు ముప్పు వాటిల్లుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
సముద్రం.. అల్లకల్లోలం
తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. కాకినాడ రూరల్, కొత్తపల్లి తొండంగి మండలాల అధికారులు తీరం వెంబడి గస్తీ ఏర్పాటు చేశారు. వర్షాలు భారీగా కురిసి, ఈదురు గాలులు పెరిగితే తీరం వెంబడి ఉన్న మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్‌లో 24 గంటలూ పని చేసేలా కంట్రోల్ రూము ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. వరదలు, చెట్లు పడిపోవడం, రహదారులపై ఆటంకాల వంటి పరిస్థితుల్లో కంట్రోల్ రూముకు 0884–23568012 లేదా 98499 03879 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
పంపా పరవళ్లు
భారీ వర్షాలతో అన్నవరం వద్ద పంపా రిజర్వాయర్‌లోకి భారీగా నీరు చేరుతోంది. సోమవారం సాయంత్రం 88 అడుగులుగా ఉన్న జలాశయం నీటిమట్టం బుధవారం సాయంత్రానికి ఏకంగా 7 అడుగులు పెరిగి 95 అడుగులకు చేరింది. పరీవాహక ప్రాంతమైన శంఖవరం, రౌతులపూడి మండలాల్లోని ఏజెన్సీ గ్రామాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్‌లోనికి 400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 0.43 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.30 టీఎంసీల మేర నిల్వలున్నాయని అధికారులు తెలిపారు. పంపా గరిష్ట నీటిమట్టం 103 అడుగులు కాగా, గురువారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 100 అడుగులకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రిజర్వాయర్ నీటిమట్టం పెరిగితే బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దాపురం ఇరిగేషన్ డివిజన్ ఈఈ జి.శేషగిరిరావు తెలిపారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాలు, వాయుగుండం నేపథ్యంలో ప్రజారోగ్యం, విద్యార్థుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై జిల్లా స్థాయి అధికారులు, వివిధ మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిస్థితులు, వర్షపాతం వివరాలు, ప్రధాన రిజర్వాయర్ల నీటిమట్టాలు, సహాయక చర్యల సన్నద్ధతపై చర్చించి, పలు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు గురువారం కూడా కురిసే అవకాశం ఉన్నందున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పాఠశాల భవనాల పరిస్థితిని, సీలింగ్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతించాలని స్పష్టం చేశారు. రాబోయే 10 రోజుల్లో ప్రసవ తేదీ ఉన్న 30 మంది గర్భిణులను పీహెచ్‌సీలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి చెప్పారు.
నేడు పాఠశాలలకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు గురువారం సెలవు ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
తీవ్ర వాయుగుండం ప్రభావం
జిల్లాలో ఎడతెరిపి లేకుండా
భారీ వర్షాలు
జలమయమైన లోతట్టు ప్రాంతాలు
జనజీవనం అస్తవ్యస్తం
అల్లకల్లోలంగా సముద్రం


