మామిడికుదురు: అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి మాస కల్యాణాన్ని బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ ఈ ఉత్సవం అత్యంత వేడుకగా జరిగింది. స్వామి వారి జన్మనక్షత్రం శ్రవణం కావడంతో ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కల్యాణోత్సవాన్ని ఈఓ ఎం.రాంబాబురెడ్డి పర్యవేక్షించారు.
భారతీయ సంస్కృతికి
మూలస్తంభాలు వేదాలు
అమలాపురం టౌన్: భారతీయ సంస్కృతిని, హిందూ ధర్మానికి నాలుగు వేదాలు మూల స్తంభాలని ఘనపాఠులు అన్నారు. అమలాపురం సత్యసాయి కల్యాణ మండపంలో బుధవారం సాయంత్రం జరిగిన 64వ కోనసీమ వేద శాస్త్ర సన్మాన సభలో వారు ఉపన్యసించారు. సభకు అధ్యక్షత వహించిన దువ్వూరి ఫణి యజ్ఞేశ్వర సోమయాజులు ఘనపాఠి మాట్లాడుతూ, వేద వ్యాస మహర్షి ఈ అనంతమైన జ్ఞానాన్ని రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనే నాలుగు భాగాలుగా విభజించి మానవాళికి అందించారని చెప్పారు. శృంగేరి ఆస్థాన విద్వాంసుడు విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి వేద సభ విశిష్టత గురించి వివరించారు. ప్రవా రామకృష్ణ సోమయాజి వైదిక ధర్మం – విశ్వ మానవ శ్రేయస్సు అనే అంశంపై ప్రసంగించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ మెంబర్ విష్ణుభట్ల నాగ శంకర వేంకట లక్ష్మీనారాయణ ఘనపాఠి వైదిక వా/్మయం విశిష్టతను విశ్లేషించారు. తంగిరాల సుబ్రహ్మణ్య సోమయాజులు అధర్వణ వేదం, యజుర్వేద క్రమంపై అనుగ్రహ భాషణం చేశారు. వడ్లమాని సుబ్రహ్మణ్య ఘనపాఠి వేద రక్షణ ఆవశ్యకతను వివరించారు. గుళ్లపల్లి సీతారామ శ్రీహర ఘనపాఠి వేద విద్యార్థులకు వేదాధ్యయనం గురించి చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 200 మంది వేద పండితులు ఈ వేద సభకు హాజరయ్యారు. కడియాల వేంకట సత్య సీతారామ ఘనపాఠి ఆధ్వర్యాన ఒకేసారి 200 మంది వేద పండితులు ఏకకంఠంతో చెప్పిన వేదస్వస్తితో అమలాపురం పట్టణం పులకించింది. అనంతరం వేద పండితులను సత్కరించారు. శ్రీ కోనసీమ వేద శాస్త్ర సన్మాన సభ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు గుళ్లపల్లి ప్రభాకర ఫణి రాజా, గుళ్లపల్లి వెంకట్రామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
బైపాస్ రోడ్డుకు అవినీతి బీటలు
నిర్మించిన నెల రోజులకే దిగిపోయిన
ఈదరపల్లి – ముక్కామల రోడ్డు
అమలాపురం రూరల్: ఈదరపల్లి – ముక్కామల మధ్య బైపాస్ రోడ్డు అవినీతి బీటలు తీసింది. ఆధునికీకరించిన నెల రోజులకే ఈ రోడ్డు కుంగిపోయింది. జూలై నెలలో కోట్లాది రూపాయల ఖర్చుతో పంట కాలువ వైపు రక్షణ గోడ నిర్మించారు. పాలగుమ్మి, నడిపూడి, మొసలపల్లి, నేదునూరు, పెద్దపాలెం, ముక్కామల ప్రాంతాల్లో కాలువకు రివిట్మెంట్ నిర్మించారు. కొత్తగా బీటీ రోడ్డు వేశారు. అప్పట్లో నెల రోజుల పాటు పంట కాలవకు నీరు నిలిపి వేసి మరీ ఈ పనులు చేశారు. నీరు నిలిపివేయడంపై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంబంధిత కాంట్రాక్టర్‌పై మండిపడి, కేసు కూడా నమోదు చేయించారు. అనంతరం, గత ఆగస్టు నెలలో రోడ్డు పనులు మొక్కుబడిగా చేసి, మమ అనిపించారు. నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఈ రోడ్డు కుంగిపోయి ప్రమాదకరంగా తయారైంది. దీనిపై వాహనదారులు మండిపడుతున్నారు. తక్షణమే ఈ రోడ్డుకు మరమ్మతులు చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.


