కాకినాడ రూరల్: వినాయక చవితి పర్వదినం మొదలు తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడు తిరిగి గంగమ్మ ఒడిని చేరి.. అక్కడి నుంచి తల్లిదండ్రుల చెంతకు పయనమవుతున్నాడు. జిల్లావ్యాప్తంగా వేలాది మండపాల్లో కొలువుదీరి, పూజలందుకున్న గణేశుని నిమజ్జనోత్సవాలను భక్తులు బుధవారం కోలాహలంగా నిర్వహించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా.. బాజాభజంత్రీలు, నృత్యాలు, బాణసంచా కాల్పుల నడుమ భారీ ఊరేగింపులు నిర్వహిస్తూ.. సాగర జలాల్లోను, గోదావరి, ఏలేరు కాలువల్లోను ఏకదంతుని విగ్రహాలను నిమజ్జనం చేశారు. కాకినాడ రూరల్ సూర్యారావుపేట న్యూ ఎన్టీఆర్ బీచ్‌లో సుమారు 1,000 విగ్రహాలు నిమజ్జనం చేసే అవకాశముందని నగర గణేశ ఉత్సవ సమితి అంచనా వేసింది. ఈ మేరకు భారీ విగ్రహాలను నేరుగా సముద్రం వరకు తీసుకువెళ్లేలా అధికారులు రోడ్డు ఏర్పాటు చేశారు. దీంతోపాటు నిమజ్జనం చేసేందుక భారీ క్రేన్లు సైతం అందుబాటులో ఉంచారు. ఇక్కడ బుధ, గురువారాల్లో నిమజ్జనోత్సవాలు జరుగుతాయని ముందుగానే ప్రకటించారు. తొలి రోజున 400 వరకూ విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని అధికారులు, పోలీసులు అంచనా వేశారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లోకల్లోలంగా మారడం, తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తూండటంతో.. ఎస్పీ బింధుమాదవ్ ఆదేశాల మేరకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తీరంలో గజ ఈతగాళ్లు, సముద్రంలో మైరెన్ పోలీసులు, కోస్ట్‌గార్డ్ సిబ్బంది పహారా కాశారు.


