1,95,602 ఓట్ల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

1,95,602 ఓట్ల తొలగింపు

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా వివిధ కారణాలతో జిల్లావ్యాప్తంగా 1,95,602 ఓట్లు తొలగించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) డి.తిప్పేనాయక్‌ తెలిపారు. వీటిలో 31,695 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, క్లెయిములు, అభ్యంతరాలను అక్టోబర్‌ 5లోగా పరిష్కరించి, తుది ఓటర్ల జాబితాను అక్టోబర్‌ 9న ప్రచురిస్తామని చెప్పారు. తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు అన్ని పార్టీలూ సహకరించాలని కోరారు. నాణ్యతకు ప్రాధాన్యం ఇరోజుకు గరిష్టంగా వంద నోటీసులు మాత్రమే పరిశీలించాల్సిందిగా ఏఈఆర్‌ఓలకు సూచించామన్నారు. జిల్లాలోని 7 నియోజక వర్గాల పరిధిలోని 1,822 పోలింగ్‌ కేంద్రాల్లో ఇప్పటి వరకు 14,55,209 ఓటర్లుగా నమోదయ్యారని చెప్పారు.

ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల జాబితాకు చర్యలు

శాసన మండలి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల జాబితా తయారీకి చర్యలు తీసుకుంటున్నామని డీఆర్‌ఓ తిప్పేనాయక్‌ తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 28న నోటీసు జారీ చేస్తామని చెప్పారు. నవంబర్‌ 6వ తేదీ వరకు ఫారం–19 దరఖాస్తులు స్వీకరిస్తామని, దీనికి అనుగుణంగా నవంబర్‌ 25న ముసాయిదా జాబితా ప్రకటిస్తామని వివరించారు. నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 10 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తామని, డిసెంబర్‌ 25 నాటికి వాటిని పరిష్కరించి, డిసెంబర్‌ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని తెలిపారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులందరూ నిబంధనల ప్రకారం తమ ఓటు దరఖాస్తులను సక్రమంగా సమర్పించేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని డీఆర్‌ఓ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement