అన్నవరం: శ్రావణ శుద్ధ ఏకాదశి, ఆదివారం కలిసి రావడంతో వేల మంది భక్తులతో రత్నగిరి కిటకిటలాడింది. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. దీంతో అన్నవరం దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవికి స్వర్ణపుష్పార్చన చేశారు. తర్వాత కుంకుమ పూజ, పుష్పార్చన నిర్వహించారు. భక్తుల రద్దీ కారణంగా సత్యదేవుని దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. రూ.200 టిక్కెట్ తీసుకున్న భక్తులను వెలుపల నుంచి దర్శనానికి అనుమతించారు. 2,500 వ్రతాలు జరగ్గా, సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చింది.
సరస్వతీదేవిగా వనదుర్గమ్మ
శ్రావణమాస జాతర మహోత్సవాల్లో భాగంగా రత్నగిరిపై వనదుర్గమ్మ వారిని సరస్వతీదేవిగా అలంకరించారు. ఉదయం వివిధ పూజలు, చండీ పారాయణ చేశారు. సాయంత్రం లక్ష కుంకుమార్చన, చండీహోమం నిర్వహించారు. కొండ దిగువన తొలిపాంచా వద్ద కొలువైన కనకదుర్గమ్మ వారి జన్మ నక్షత్రం మూల సందర్బంగా అమ్మవారికి పండితులు చండీ హోమం జరిపారు. అనంతరం అమ్మవారికి నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి ప్రసాదాలు నివేదించారు.


