బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. జిల్లాలో సర్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈ నెల 14వ తేదీ వరకూ ఓటరు నమోదు అధికారులు, బూత్ స్థాయి అధికారులకు నిర్వహణ సన్నద్ధత, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వివేకానంద సమావేశ మందిరంలో ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలకు శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. సమగ్ర శిక్షణ అనంతరం, ఈ నెల 15 నుంచి జూలై 14వ తేదీ వరకూ ప్రతి ఇంటినీ సందర్శించి ఓటర్ల ఎన్యూమరేషన్ చేపట్టాలని సూచించారు. సర్ ప్రక్రియ గురించి వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయడం, అనర్హులను, డూప్లికేట్ ఎంట్రీలను, చనిపోయిన, వేరొక ప్రాంతానికి తరలిపోయిన వారిని తొలగించడం లక్ష్యంగా ‘సర్’ను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ డి.తిప్పేనాయక్ కూడా పాల్గొన్నారు.
నేటి నుంచి తెలుగు
సాహితీ మహాసభలు
రాజానగరం: వెలుగుబంద సమీపంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ(జీజీయూ)లో రెండు రోజుల పాటు జరిగే ఏడో ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు శనివారం ప్రారంభం కానున్నాయి. సాహిత్య, సాంస్కృతిక విభాగాలు, రంగస్థల ప్రదర్శనలు, జానపద కళారూపాలు, ప్రాచీన కవుల వారసుల ప్రత్యేక ప్రదర్శనలు వీటిలో ముఖ్య ఆకర్షణలుగా ఉంటాయని నిర్వాహకులు కేవీవీ సత్యనారాయణరాజు, కత్తిమండ ప్రతాప్ తెలిపారు.
డిప్యూటీ స్పీకర్‌ను
బర్తరఫ్ చేయాలి
నిడదవోలు: రాష్ట్రంలోని 1.10 కోట్ల మంది దళితులు, దళిత క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్న శాసన సభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని జై భీమ్‌రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. దళిత సంఘాలు, దళిత క్రైస్తవ ప్రతినిధులతో నిడదవోలులో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, రఘురామ కృష్ణరాజుకు అల్టిమేటం ఇవ్వడానికి, ప్రభుత్వ పెద్దలకు గుణపాఠం చెప్పడానికి ఈ నెల 28న ఏలూరులో లక్ష మంది దళితులు, దళిత క్రైస్తవులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి, దళితులు, దళిత క్రైస్తవులు తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ రాష్ట్రంలోని 113 చర్చిలను, చర్చిలపై మైకులను తొలగించాలంటూ రఘురామ కృష్ణరాజు ఏ అధికారంతో డీజీపీకి లేఖ రాశారో చెప్పాలని ప్రశ్నించారు. తాను ఏ మతానికి, సంప్రదాయానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. దళితులు, దళిత క్రైస్తవుల ఓట్లు వద్దని చెబుతున్న రఘురామ కృష్ణరాజు.. వారు కడుతున్న పన్నును జీతంగా ఎలా తీసుకుంటారని శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. ఇప్పటి వరకూ తీసుకున్న జీతాన్ని రఘురామ ప్రభుత్వానికి జమ చేసి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సొరంగ మార్గంలో
ప్రయాణం ప్రమాదకరం
దేవీపట్నం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గొందూరు నుంచి ఎడమ కాలువ, నావిగేషన్ కెనాల్‌కు నీరందించేందుకు కొండను తవ్వి నిర్మించిన సొరంగ మార్గంలో ప్రయాణించడం ప్రమాదకరమని దేవీపట్నం ఎస్సై షరీఫ్ తెలిపారు. ఇటీవల గండిపోశమ్మ ఆలయానికి వచ్చేందుకు పురుషోత్తపట్నం వైపు నుంచి ఉన్న రహదారిని ప్రాజెక్టు అధికారులు మూసివేశారు. అయితే, ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా చేసుకుని రీల్స్ చేసేందుకు కొంతమంది పురుషోత్తపట్నం, నేలకోట వైపు నుంచి సొరంగ మార్గంలో గొందూరు చేరుకుంటున్నారన్నారు. ఈ మేరకు సొరంగ మార్గంలో ప్రయాణించడం ప్రమాదకరమని తెలిపే ఫ్లెక్సీలు పెట్టి, పహారా ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఈ మార్గంలో ప్రయాణిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


