ప్రత్తిపాడు రూరల్: మండలంలోని పోతులూరులో తాగునీరు కలుషితం కావడం తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని రక్షిత మంచినీటి పథకం ద్వారా గురువారం సరఫరా అయిన నీటి నుంచి పురుగు మందుల వాసన, నీరు రంగు మారి నురగలు రావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఎంపీడీఓ ఎంవీఆర్ కుమార్‌బాబుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు పోతులూరులోని రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలించారు. తాగునీటి సరఫరాను తక్షణం నిలిపివేశారు. నీరు కలుషితమవడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. నీటి నమూనాలు సేకరించి, ల్యాబ్‌కు తరలించారు. కలుషితమైన ఈ నీటిని ఎవ్వరూ తాగవద్దని, ఇతర అవసరాలకు వినియోగించవద్దని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు గ్రామంలో దండోరా వేయించారు. ప్రజలు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ నీటి వనరులను వినియోగించుకోవాలని సూచించారు. ల్యాబ్‌లో నీటి పరీక్షల ఫలితాల అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాటర్ ట్యాంకును బ్లీచింగ్‌తో రెండుసార్లు శుభ్రం చేసి, నీటిలో బ్లీచింగ్ వేసి, నాలుగు గంటల పాటు ఉంచి, శుక్రవారం సాయంత్రం తాగునీటిని సరఫరా చేసినట్లు ఎంపీడీఓ తెలిపారు.


