కొత్తపేట: రాష్ట్రంలో ఆరు నుంచి పదో తరగతి వరకూ సాంఘిక శాస్త్ర సిలబస్ మిగిలిన సబ్జెక్టులతో పోల్చితే అత్యధికంగా ఉంటోంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లింది. పాఠ్యాంశాలపై పునఃసమీక్ష జరిపి, సిలబస్ భారం తగ్గించాలని ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ఎం.వెంకట కృష్ణారెడ్డికి, విద్యాశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించింది. ప్రస్తుత పాఠ్యాంశాల నిర్మాణాన్ని పరిశీలిస్తే, ఒకే సబ్జెక్టులో చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌర శాస్త్రం, ఆర్థిక శాస్త్రం వంటి విభిన్న అంశాలను బోధించాల్సి వస్తోంది. దీనివల్ల విద్యార్థులపై అధిక విద్యాభారం పడటమే కాకుండా, బోధనా నాణ్యతపై కూడా ప్రభావం పడుతోంది. దీంతో సిలబస్ తగ్గించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
పాఠాలు అధికం
ఇటీవల సిలబస్ మార్పుల నేపథ్యంలో గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం వంటి సబ్జెక్టుల్లో పాఠాలను గణనీయంగా తగ్గించారు. కానీ సాంఘిక శాస్త్రంలో మాత్రం ఇప్పటికీ అత్యధిక పాఠాలు కొనసాగుతున్నాయి. ఉదాహరణకు పదో తరగతి సైన్స్ సబ్జెక్టులో బయాలజీ 5, ఫిజిక్స్ 4, కెమిస్ట్రీ 4.. కలిపి మొత్తం 13 పాఠాలున్నాయి. వీటిని వేర్వేరు ఉపాధ్యాయులు బోధించే అవకాశం కూడా ఉంటుంది. అదే పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 22 పాఠాలు ఉన్నాయి. వీటిని ఒక్కరే బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం పదో తరగతికి మాత్రమే పరిమితం కాదు, మిగిలిన తరగతులకూ వర్తిస్తోంది. వీటి బోధనకు ఉపాధ్యాయులు, చదవటానికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
ఫ ఉపాధ్యాయుల ఆవేదన
ఫ సిలబస్ తగ్గించాలని డిమాండ్
ఫ విద్యార్థులకూ కష్టమని వివరణ
ఫ పునఃసమీక్ష చేయాలని వినతి


