కొత్తపల్లి: స్ధానిక జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న యాళ్ల పద్మజను, మూలపేట జిల్లా పరిషత్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నల్లం అచ్యుత రామచంద్రమూర్తి దంపతులు గురువారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం చంపారన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బిర్సా ముండా జాతీయ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టుల్లో చేసిన విశేషమైన కృషికి ఈ అవార్డు ఇచ్చారు. అవార్డు గ్రహీతలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శాస్త్రి, శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు అభినందించారు.
రేషన్ బియ్యం పట్టివేత
● కేసు నమోదు ● విలువ రూ.6 లక్షలు
దేవరపల్లి: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం యర్రవరం గ్రామానికి అక్రమంగా రవాణా చేస్తున్న 14,470 కిలోల రేషన్ బియ్యాన్ని గురువారం దేవరపల్లి వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అధికారులు పట్టుకున్నారు. వివరాలను సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్ ఎ.సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం నుంచి 14,470 కిలోల రేషన్ బియ్యం(326 బస్తాలు) లారీలో యర్రవరం పౌల్ట్రీకి తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో సివిల్ సప్లయ్ జిల్లా సహాయ అధికారి నాగాంజనేయులు ఆధ్వర్యంలో దేవరపల్లి వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవే సమీపంలో పట్టుకున్నట్టు సత్యనారాయణ తెలిపారు. బియ్యంతో సహా లారీని సీజ్ చేసి, 6(ఎ), 7(1) కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. పట్టుబడిన బియ్యం విలువ సుమారు రూ. 6 లక్షలు ఉంటుందన్నారు.
తిరుమలాయపాలెంలో..
గోకవరం: మండలంలోని తిరుమలాయపాలెం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 49 బస్తాల రేషన్ బియ్యాన్ని గురువారం ఎంఎస్‌ఓ శాంతిప్రియ స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు గ్రామంలోని కంటే దుర్గకు చెందిన రేషన్‌షాపును తనిఖీ చేసి ఈ బియ్యాన్ని గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని, షాపుపై 6ఏ కేసు నమోదు చేశామని ఎంఎస్‌ఓ తెలిపారు.
గో మాంసం స్వాధీనం
గొల్లప్రోలు (పిఠాపురం రూరల్): వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గోమాంసాన్ని గొల్లప్రోలు టోల్‌గేట్ సమీపంలో గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్‌తో పాటు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని రెవెన్యూ అధికారుల సమక్షంలో నిర్వీర్యం చేశామన్నారు.
673 జీవోతో ప్రగతికి చేటు
బోట్‌క్లబ్ (కాకినాడ): స్థానిక సంస్థలకు చెందిన ముఖ్యకూడళ్లలోని ఖరీదైన ఖాళీ స్థలాలు, మైదానాలు, పార్కులు, మార్కెట్లు, దుకాణ సముదాయాలు, కమ్యూనిటీ హాళ్లను పీపీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరించే 673 జీవో విధానం ప్రగతికి చేటు తెస్తుందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్ల రమణరాజు అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ ఖాళీ స్థలాల్లో గుడ్ విల్ యాక్షన్ విధానంలో జనతా దుకాణాల సముదాయాల నిర్మాణం చేపడితే ప్రజాహిత ప్రగతి పథంగా ఉంటుందన్నారు. పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ ప్రణాళిక వలన స్థానిక ఆస్తులు లీజుల ప్రక్రియ ఉచ్చులో కార్పోరేట్ దోపిడీకి గురవ్వక తప్పదన్నారు. ఆ జీవో వల్ల పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పార్కుల అజమాయిషీ, 14 రకాల పౌర సౌకర్యాల సేవలు మరింత భారంగా మారతాయన్నారు.


