ఆలమూరు: వ్యవసాయం లాభసాటిగా ఉండడంతో పాటు భూసారం పెరగాలంటే రైతులు కొన్ని పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా రబీ, ఖరీఫ్‌లకు మధ్య వేసవిలో చేపట్టే దుక్కులతో భూసారం పెరుగుతుంది. ఇవి రైతులకు సాగులో వెన్నుదన్నుగా నిలిచి సాగులో పెట్టుబడి తగ్గించుకోవడానికి దోహదపడతాయి. నేడు ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి రావడంతో ట్రాక్టర్ల సాయంతో చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సుమారు 4.69 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగనుంది.
యాజమాన్య పద్ధతులు
ఫ భూసార పరీక్షలు చేయించుకోవడం, భూమిని శుభ్రం చేసుకోవడం, లోతు దుక్కులు వంటి ముందస్తు చర్యలు చేపట్టడం ద్వారా ఖరీఫ్‌లో మంచి దిగుబడులు అందుకునే వీలుంటుంది.
ఫ ఎండాకాలంలో భూములు ఖాళీగా ఉన్న సమయంలో లోతు దుక్కు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముందుగానే ప్రారంభం కాబోతోంది.
ఫ వేసవి దుక్కులు మెట్ట, చాగల్నాడు ప్రాంతాల రైతులకు ఎంతో ఉపపయోకరంగా ఉంటాయి. ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లోనూ దుక్కులు చేపడుతున్నారు.
ప్రయోజనాలు ఇవే..
ఫ వేసవి లోతు దుక్కులు చేపట్టడం వల్ల భూమి సారవంతమవుతుంది. భూమి కింద పొరల్లోని మట్టి పైకి రావడం, పై పొరల్లో మట్టి వెళ్లడం వల్ల ఎండ వేడికి అందులోని క్రిమికీటకాలు నశిస్తాయి.
ఫ నేల గుల్లబారి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. వర్షం నీరు వృథా కాకుండా సద్వినియోగం చేసుకునే వీలుంటుంది.
ఫ పొలాల్లో లోతుగా దున్నడం వల్ల భూమిలో నీరు ఇంకి పోయి, తేమ శాతం పెరిగి సేంద్రియ పదార్థాలు త్వరితగతిన కుళ్లిపోయి పోషకాలుగా మారతాయి.
ఫ భూమిని అడుగు లోతు వరకూ దున్నితే విత్తనం వేగంగా మొలకెత్తి, వేళ్లు సులభంగా భూమిలో దిగి మొక్కకు సారం పెరుగుతుంది.
ఫ దుక్కుల వల్ల కింద నుంచి పైకి వచ్చే పురుగులను పక్షులు తినడం ద్వారా తెగుళ్ల బెడద తప్పుతుంది.
ఫ పొలాల్లో మట్టి గడ్డలు తొలగిపోయి సారవంతమైన నేల ఏర్పడుతుంది. తద్వారా నాణ్యమైన పంట పండించేందుకు దోహదపడుతుంది.
భూసారం పెరుగుతుంది
వ్యవసాయశాఖ సూచనలకు అనుగుణంగా పంట పొలాల్లో దుక్కు దున్నడం ద్వారా భూసారం పెరుగుతుంది. దీని వల్ల తెగుళ్లను నివారించుకోవడం ద్వారా పెట్టుబడిని ఆదా చేసుకోవచ్చు, అధిక దిగుబడులకు ఆస్కారం కలుగుతుంది. రైతులందరూ క్రమం తప్పకుండా దుక్కుకు ప్రాధాన్యమివ్వాలి.
– సీహెచ్‌కేవీ చౌదరి, వ్యవసాయశాఖ సహాయ
సంచాలకులు, ఆలమూరు డివిజన్
నిబంధనలు తప్పనిసరి
ఖరీఫ్ పంటకు తెగుళ్ల బెడదను నివారించి, అధిక దిగుబడులు సాధించాలంటే వ్యవసాయశాఖ సూచనలతో పాటు కొన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలి. సాధారణ కల్టివేటర్ (ట్రాక్టర్‌కు వాడే మామూలు నాగలి)కు బదులు లోతు దుక్కు దున్నడానికి రెక్క నాగలి, బల్లెపు నాగలి, గునపపు నాగలి వాడాలి. దీని వల్ల నేల 30 నుంచి 75 సెంటీమీటర్ల లోతుకు దిగి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వాలుకు అడ్డంగా దుక్కి చేయడం వల్ల భూమి కోతకు గురి కాకుండా తేమ ఎక్కువగా పెరుగుతుంది. ప్రస్తుతం పొలాలు ఖాళీగా ఉండటం వల్ల కలుపు మొక్కలు విపరీతంగా పెరిగిపోతాయి. వాటి వల్ల వచ్చే పంటకు కలుపు బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వేసవి దుక్కులు చేసుకుంటే ఉపయోగం కలుగుతుంది.
ఫ దుక్కి దున్నితే లాభాల పంటే
ఫ వేసవి దుక్కులతో ఎంతో ప్రయోజనం
ఫ ప్రాధాన్యత ఇస్తున్న రైతులు


