బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్సార్ సీపీ ఎంప్లాయిస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి రామారావు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో పురోగతి కనిపించడం లేదన్నారు. పెండింగ్ డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ సమస్యల పరిష్కారం, వైద్య భద్రత, పెన్షనర్ల సంక్షేమం వంటి అంశాలపై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలుకు కార్యాచరణ ప్రకటించలేదన్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పనిచేయడం లేదని, రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు క్యాష్‌లెస్ సేవలు అందించడం లేదని చెప్పారు. పీఆర్సీని ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటీకరించే ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఎంప్లాయిస్ పెన్షనర్స్ విభాగం కాకినాడ అర్బన్ అధ్యక్షుడు మహిపాల్, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తుమ్మల నూకరాజు పాల్గొన్నారు.


