కోకోకు ప్రమాణాల రూపకల్పన అవసరం | - | Sakshi
Sakshi News home page

కోకోకు ప్రమాణాల రూపకల్పన అవసరం

Jun 5 2026 12:30 AM | Updated on Jun 5 2026 12:30 AM

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): రాష్ట్రంలో కోకో సాగు నాణ్యతను మెరుగుపరచి అంతర్జాతీయ మార్కెట్లలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు భారతీయ కోకో బీన్స్‌కు ప్రమాణాల రూపకల్పన అవసరమని ఏపీ రాష్ట్ర ఫుడ్‌ ప్రోసెసింగ్‌, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ (ఏపీఎఫ్‌పీఎస్‌) ఆధ్వర్యంలో గురువారం రాజమహేంద్రవరంలోని ఐసీఏఆర్‌–ఎన్‌ఐఆర్‌సీఏ(నిర్కా)లో నిర్వహించిన ‘ఎస్టాబ్లిషింగ్‌ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ కోకో బీన్స్‌ అంశంపై ఒకరోజు అవగాహన వర్క్‌షాప్‌ నిర్వహించారు. చిరంజీవి చౌదరి మాట్లాడుతూ, కోకో పంటకు ఆంధ్రప్రదేశ్‌.. దేశంలోనే ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా ఎదుగుతోందన్నారు. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తే అధిక ధరలు పొందే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఏపీఎఫ్‌పీఎస్‌ సీఈఓ గెడ్డం శేఖర్‌ బాబు మాట్లాడుతూ, కోకో రైతులను ప్రాసెసింగ్‌ పరిశ్రమలతో అనుసంధానం చేయడం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. కోకోశాల (చైన్నె) వ్యవస్థాపకుడు, కన్సల్టెంట్‌ నితిన్‌ చోర్డియా సాంకేతిక సెషన్‌లో మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో కోకో బీన్స్‌కు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో గ్రేడింగ్‌, నిల్వ విధానాల్లో పాటించాల్సిన శాసీ్త్రయ పద్ధతులను వివరించారు. చాక్లెట్‌, కోకో పౌడర్‌, కోకో బటర్‌ తదితర విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ అవకాశాలపై రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు. వక్తలు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 38,671 హెక్టార్లలో కోకో సాగు జరుగుతోందని, ఏలూరు, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాలు కోకో ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్నాయని వెల్లడించారు. కోకో సాగు, ప్రాసెసింగ్‌పై మార్గదర్శకాలకు 79950 87041 ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ను సంప్రదించాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏపీఎఫ్‌పీఎస్‌ ఈడీ ఏ దుర్గేష్‌, ఉద్యాన శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ యు.సుధ, ఐదు జిల్లాల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు, కోకో ప్రాసెసింగ్‌ యూనిట్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఏపీ ఫుడ్‌ ప్రోసెసింగ్‌, పరిశ్రమలు,

వాణిజ్యశాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవిచౌదరి

Advertisement
 
Advertisement
Advertisement