● రత్నగిరిపై భక్తులకు అందని
అత్యవసర వైద్యం
● గుండెపోటుతో ఆరు నెలల్లో ఇద్దరి మృతి
● అలంకారప్రాయంగా కార్పొరేట్ ఆసుపత్రి సేవా కేంద్రం
అన్నవరం: అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందించే అవకాశం రత్నగిరిపై లేకపోవడం భక్తులకు ప్రాణసంకటంగా మారుతోంది. కొండపై అందుబాటులో ఆస్పత్రి, అంబులెన్సు వంటి సదుపాయాలు లేవు. దీంతో, ఊహించని విధంగా అస్వస్థతకు గురైన కొంత మంది భక్తులు చికిత్సలో జాప్యం జరిగి ప్రాణాలు కోల్పోతూండటం.. వారి కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగులుస్తోంది. ముఖ్యంగా 50 సంవత్సరాల వయస్సు నిండిన భక్తులు ఉపవాసంతో, ఎంతో భక్తితో సత్యదేవుని వ్రతాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుని, ఆలయం వెలుపలకు రాగానే డీహైడ్రేషన్‌తో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ప్రస్తుత వేసవిలో ఈ ఇబ్బంది మరింతగా ఉంటోంది. గుండెపోటు, షుగర్, బీపీ తదితర వ్యాధులున్న వారు అస్వస్థతకు గురైతే తక్షణ వైద్యం అందించే అవకాశం దేవస్థానంలో లేదు. కొండ దిగువన ఉన్న దేవస్థానం వైద్యశాలకు తరలించినా, అక్కడ సరైన వైద్యం అందడం లేదు. కొంతమందిని తుని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. కానీ, ఆయా ఆసుపత్రులకు తరలించే లోపే అత్యవసర చికిత్స అందక భక్తులు మార్గం మధ్యలోనే మృతి చెందుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గడచిన ఆరు నెలల వ్యవధిలో ఈవిధంగా ఇద్దరు భక్తులు గుండెపోటుతో ఆలయం వెలుపల మృతి చెందారు. గత నవంబర్‌లో పెద్దాపురం మండలం దివిలికి చెందిన వెన్నా సత్యనారాయణ, గత మంగళవారం అన్నవరం సమీపంలోని బెండపూడికి చెందిన మద్దుకూరి బుచ్చిబాబు గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఇద్దరికీ కూడా తక్షణ వైద్య సహాయం అందకపోవడం గమనార్హం.
వైద్య శాలలో అరకొర సేవలు
అన్నవరం దేవస్థానం కొండ దిగువన గత 60 ఏళ్లుగా ఉచిత వైద్యశాలను నిర్వహిస్తోంది. వైద్యపరంగా అన్నవరం గ్రామానికి ఒకప్పుడు ఇదే పెద్ద దిక్కు. తగినంత మంది సిబ్బంది ఉన్నప్పటికీ కాలక్రమేణా భక్తులకు తగిన వైద్య సహాయం అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సిబ్బంది సకాలంలో వస్తున్నా వైద్యాధికారి మాత్రం ఆలస్యంగా విధులకు హాజరవుతూండటంతో అరకొర వైద్యమే అందుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. వైద్యాధికారి కోసం ఎదురు చూసి వెళ్లిపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. దేవస్థానంలో కనీస వైద్య సదుపాయం అందే పరిస్థితి లేదు. ఓ కార్పొరేట్ ఆసుపత్రి సిబ్బంది రత్నగిరి రామాలయం ఎదురుగా ఓ కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ కనీసం తలనొప్పి మాత్రలు కూడా ఉండటం లేదనే విమర్శ ఉంది.
ఈ చర్యలు మేలు
● భక్తులు ఉపవాసంతో కాకుండా టీ, కాఫీ, పాల వంటి ద్రవ పదార్థాలు తీసుకోవచ్చని, అలాగే, బీపీ, షుగర్ బాధితులు తగిన మందులు వేసుకుని, వ్రతాలు, దర్శనం చేసుకోవచ్చని మైకులో ప్రచారం చేయాలి.
● కార్తిక మాసం, స్వామివారి కల్యాణోత్సవాల్లో మాత్రమే ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను నిత్యం కొనసాగించాలి. పీహెచ్‌సీ, దేవస్థానం ఆసుపత్రి సిబ్బంది రత్నగిరిపై పగలు, రాత్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
● బీపీ, షుగర్ హెచ్చుతగ్గులను నియంత్రించే మందులు, గుండెనొప్పి వస్తే తక్షణం పని చేసే మందులను రత్నగిరిపై అందుబాటులో ఉంచాలి.
● డీహైడ్రేషన్‌కు గురవకుండా భక్తులకు తగిన వైద్య సహాయం అందించాలి.
● రత్నగిరిపై ఉన్న కార్పొరేట్ ఆసుపత్రి కేంద్రంలో అనుభవజ్ఞులైన సిబ్బందితో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి.
● రత్నగిరికి ప్రత్యేకంగా అంబులెన్సు ఉండేలా చర్యలు తీసుకోవాలి. భక్తులు గుండెపోటుకు గురైతే అంబులెన్స్ సిబ్బంది సీపీఆర్ చేసి సకాలంలో ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేయాలి.


