ఇన్‌చార్జి డీపీటీఓగా మనోహర్‌ | - | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జి డీపీటీఓగా మనోహర్‌

Jun 5 2026 12:30 AM | Updated on Jun 5 2026 12:30 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లా ఇన్‌చార్జి ప్రజా రవాణా అధికారి(డీపీటీఓ)గా కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఎంయూవీ మనోహర్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఇక్కడ డీపీటీఓగా పని చేసిన శ్రీనివాసరావు విజయవాడ బదిలీ కావడంతో మనోహర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం, మనోహర్‌ను పలువురు ఆర్టీసీ అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

సకాలంలో

ఇంజినీరింగ్‌ పనులు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లాలోని వివిధ ఇంజినీరింగ్‌ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ ఆదేశించారు. ఆయా పనుల పురోగతిపై కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, పబ్లిక్‌ హెల్త్‌, పంచాయతీరాజ్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ, ఏపీఈడబ్ల్యూఐడీసీ వంటి ముఖ్య ఇంజినీరింగ్‌ శాఖల పరిధిలో జరుగుతున్న పనుల స్థితిగతులపై ఆయా అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం మంజూరైన అన్ని పనుల గ్రౌండింగ్‌ తక్షణమే పూర్తి చేయాలన్నారు. ఇరిగేషన్‌ కాలువలకు నీరు వదలడానికి ముందే పూడికతీత, షట్టర్లు, స్లూయిజ్‌ల మరమ్మతులు తదితర పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. గురుకుల పాఠశాల మరమ్మతులు, సామాజిక భవనాలు, పీఎంశ్రీ పాఠశాలల్లో లైబ్రరీలు, ల్యాబ్‌లు, కంప్యూటర్‌ ల్యాబ్‌ల నిర్మాణాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రంగరాయ వైద్య కళాశాల పీజీ బాలికల వసతి గృహం, పిఠాపురం ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి, అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

సీఎంఆర్‌ డెలివరీని

వేగవంతం చేయాలి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లాలోని మిల్లర్లు కస్టమ్‌ మిల్డ్‌ రైస్‌ (సీఎంఆర్‌) డెలివరీ వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌ ఆదేశించారు. రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు, సభ్యులతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీలో 2.29 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి, సీఎంఆర్‌ నిమిత్తం జిల్లాలోని మిల్లులకు ఇచ్చామన్నారు. అయితే, మిల్లింగ్‌ చేసిన బియ్యం సకాలంలో ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా నుంచి ఏపీ పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ 15 వేల మెట్రిక్‌ టన్నుల ముడి బియ్యం, 85 వేల మెట్రిక్‌ టన్నుల బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. వీటిని మిల్లర్లు ఇస్తే సకాలంలో కేంద్ర పరిధిలోని పుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు సరఫరా చేయగలమని చెప్పారు. గడువు లోగా మిల్లర్లు సీఎంఆర్‌ బియ్యం సరఫరా చేయకపోతే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు. సమావేశంలో పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ దేవుల నాయక్‌, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వల్లూరి సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

రఘురామ కృష్ణరాజును

బర్తరఫ్‌ చేయాలి

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): గత ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయని, 164 సీట్లతో ఒక ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలకు నిరాశే ఎదురైందని జై భీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌ కుమార్‌ అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ఎంత మేలు చేసిందో, ఎంత చెడు చేసిందో ప్రజలు విశ్లేషించుకుంటున్నారని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి.. దళిత క్రైస్తవుల హక్కులను హరించేలా వ్యవహరిస్తున్న శాసన సభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజును ఆ పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దళిత క్రైస్తవుల హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం ఈ నెల 28న ఏలూరులో నిర్వహిస్తున్న దళిత క్రైస్తవ సమర శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement