ఎట్టకేలకు సత్యదేవుని నామంతో కండువాలు | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు సత్యదేవుని నామంతో కండువాలు

Jun 5 2026 12:30 AM | Updated on Jun 5 2026 12:30 AM

అన్నవరం: సత్యదేవుని సన్నిధికి.. ఆ స్వామి నామం ముద్రించిన కండువాలు ఎట్టకేలకు వచ్చాయి. దేవస్థానంలో చాలా ఏళ్ల నుంచి స్వామివారి కల్యాణం, రూ.2 వేలు, రూ.1,500 టిక్కెట్‌తో వ్రతాలాచరించే భక్తులకు.. అంచు మీద జరీతో ‘శ్రీ సత్యదేవాయ నమః’ అనే నామం ముద్రించిన కండువాలు అందజేసేవారు. అయితే, కండువాల సరఫరా టెండర్‌ దక్కించుకున్న కొత్త టెండర్‌దారు రెండు వారాలుగా స్వామివారి నామం ఉన్న కండువాలు సరఫరా చేయడం లేదు. దీంతో, దేవస్థానం అధికారులు స్వామివారి నామం లేకుండా రోజుకో డిజైన్‌, రంగు కండువాలను ఇస్తూండటంతో భక్తులు అసంతృప్తి చెందుతున్నారు. దీనిపై ‘నీ నామమెంతో రుచిరా!’ ‘సాక్షి’ గురువారం ప్రచురించిన కథనం దేవస్థానంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు వెంటనే స్పందించారు. తక్షణం స్వామివారి నామంతో కూడిన కండువాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఆ మేరకు టెండర్‌దారుపై అధికారులు ఒత్తిడి తీసుకుని రావడంతో అంచుపై సత్యదేవుని నామం, శంఖచక్రాలు ముద్రించిన 900 కండువాలు రత్నగిరికి గురువారం చేరాయి. వీటిని ఆయా భక్తులకు అందజేశారు. దీనిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇవి శుక్రవారం వరకూ సరిపోతాయని, శనివారం నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం 2 వేల కండువాలు పంపించాలని టెండర్‌దారును అధికారులు ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement